స్వదేశీ రక్షణ పరికరాలు సైన్యానికి అప్పగింత

మన దేశంలో అభివృద్ధిపరచిన కొన్ని పరికరాలు, వ్యవస్థలను భారత సైన్యానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్  అప్పగించారు. వీటిలో ఫ్యూచర్ ఇన్‌ఫాంట్రీ సోల్జర్ యాజ్ ఏ సిస్టమ్, న్యూ జనరేషన్ యాంటీ పర్సనల్ మైన్ ‘నిపుణ్’, సరికొత్త సామర్థ్యాలతో కూడిన రగ్గ్‌డ్, ఆటోమేటిక్ కమ్యూనికేషన్ సిస్టమ్, ట్యాంకులకు అప్‌గ్రేడెడ్ సైట్స్ సిస్టమ్, అడ్వాన్స్‌డ్ థర్మల్ ఇమేజర్స్, అత్యాధునిక హై మొబిలిటీ ఇన్‌ఫాంట్రీ ప్రొటెక్టెడ్ వెహికిల్స్, దాడి చేసే సామర్థ్యంగల పడవలు వంటివాటిని అప్పగించారు.
రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, భారత సైన్యం, రక్షణ రంగ సంస్థలు, రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ, పారిశ్రామిక రంగం సంయుక్తంగా ఈ పరికరాలు/వ్యవస్థలను అభివృద్ధి పరిచాయి. నిరంతరం మారుతున్న పరిస్థితుల్లో రక్షణ దళాలకు మౌలిక సదుపాయాల అవసరం పెరుగుతోందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.
 భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్ళను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండటం కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి జరగాలని ఆయన పిలుపునిచ్చారు. ఎఫ్- ఇన్సాస్ లో భాగంగా పదాతి దళంలోని సైనికునికి మూడు ప్రాథమిక ఉప వ్యవస్థలను (సబ్ సిస్టమ్స్‌ను) ఇస్తారు. మొదటి సబ్ సిస్టమ్‌లో అత్యాధునిక రైఫిల్, పగలు, రాత్రి గుర్తించగలిగే విధంగా హోలోగ్రాఫిక్, రిఫ్లెక్స్ సైట్స్, చుట్టుపక్కల అన్ని కోణాల్లోనూ చూడటానికి అవకాశం కల్పించే పరికరాలు ఉంటాయి.
 సైనిక కార్యకలాపాల నిర్వహణకు కచ్చితంగా ఉపయోగపడే పరికరాలు దీనిలో ఉంటాయి. ఈ ప్రాథమిక ఆయుధ వ్యవస్థతోపాటు మల్టీ మోడ్ హ్యాండ్ గ్రెనేడ్ కూడా ఇస్తారు. దీనిని కూడా మన దేశంలోనే తయారు చేశారు. అనేక రకాలుగా ఉపయోగపడే కత్తిని కూడా ఇస్తారు. రెండో సబ్‌ సిస్టమ్‌లో రక్షణ వ్యవస్థ ఉంటుంది. దీనిలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన హెల్మెట్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉంటాయి. మూడో సబ్ సిస్టమ్‌లో కమ్యూనికేషన్, నిఘా వ్యవస్థ ఉంటుంది.
పుణేలోని ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ సహకారంతో ‘నిపుణ్’  అనే ఇండియన్ మైన్‌ను అభివృద్ధి చేశారు. ఈ పరికరాల వల్ల కమాండర్లు పరిశీలించగలిగే పరిధి మరింత పెరుగుతుంది. టీ-90 ట్యాంకుల్లో పాత థర్మల్ సైట్స్‌లో ఇమేజ్ ఇంటెన్సిఫికేషన్ సిస్టమ్స్ ఉండేవి.
అయితే వీటికి చాలా పరిమితులు ఉండేవి.  ఈ పరిమితులను ఇండియా ఆప్టెల్ లిమిటెడ్ తయారు చేసిన ధర్మల్ ఇమేజింగ్ సైట్‌ను ఉపయోగించి అధిగమించారు.  సియాచిన్ మంచు కొండ వద్ద విద్యుత్తు అవసరాలను తీర్చేందుకు సోలార్ ఫొటో వోల్టాయిక్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. దీనిని రాజ్‌నాథ్ సింగ్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు.