దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయికి రాష్ట్రపతి, ప్రధాని నివాళి

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి నాలుగో వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కర్, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేడీ నడ్డా సహా పలువురు కేంద్రమంత్రులు ఘనంగా నివాళులు అర్పించారు.

వీరితో పాటు వాజ్‌పేయి దత్త కూతురు నమితా కౌల్‌ భట్టాచార్య సైతం ఈ నివాళి కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని వాజ్ పేయి స్మారకం సదైవ్ అటల్ దగ్గరకు చేరుకున్న నేతలు అటల్ బిహారీ వాజ్ పేయికి శ్రద్ధాంజలి ఘటించారు. మహానేతకు నివాళులు అర్పించడానికి బీజేపీ అగ్రనేతలు, ప్రముఖులు ఢిల్లీలోని వాజ్​పేయీ స్మారకం ‘సదైవ్​ అటల్’కు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా జరిగిన ప్రార్ధనా సమావేశంలో కూడా పాల్గొన్నారు.

అనంతరం ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, “ఈరోజు, గౌరవనీయులైన అటల్ జీ పుణ్య తిథి నాడు, సదైవ్ అటల్‌ను సందర్శించి, ఆయనకు నివాళులు అర్పించాము. భారతదేశానికి సేవ చేయడానికి అటల్ జీ చేస్తున్న ప్రయత్నాల నుండి మేము స్ఫూర్తి పొందుతున్నాము. ఆయన భారతదేశాన్ని మార్చడానికి, 21వ శతాబ్దపు సవాళ్లకు మన దేశాన్ని సిద్ధం చేయడానికి మార్గదర్శక ప్రయత్నాలు చేశారు. 1990ల ద్వితీయార్థంలో పార్టీ అధికారంలోకి రావడానికి కీలకమైన బిజెపి ప్రముఖుడి జ్ఞాపకార్థం జరిగిన ప్రార్థనా సమావేశానికి కూడా  హాజరయ్యాము. ఎందుకంటే ఆయన స్నేహపూర్వక వ్యక్తిత్వం, పార్టీలకు అతీతంగా గల  సంబంధాలు కారణంగా చాలా మంది మిత్రులను తీసుకువచ్చారు. విజయవంతమైన కూటమిని ఏర్పాటు చేయడంలో అవి సహాయపడ్డాయి” అంటూ నివాళూలు అర్పించారు.

1998-2004 మధ్య ఆరేళ్ల పాటు ప్రధానిగా, భారతరత్న అవార్డు గ్రహీత అయిన వాజ్‌పేయి 2018లో 93 ఏళ్ల వయసులో మరణించారు. 50 సంవత్సరాలకు పైగా పార్లమెంట్ సభ్యునిగా ఉన్న ఆయన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. బిజెపి వ్యవస్థాపక అధ్యక్షులు. మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. పూర్తికాలం ఐదేళ్లు ప్రధానిగా పనిచేసిన తొలి కాంగ్రెసేతర నాయకుడు ఆయనే.

“ప్రముఖ ప్రజా నాయకుడు, గొప్ప దేశభక్తుడు, డైనమిక్ స్పీకర్, అసంఖ్యాక కార్యకర్తలకు స్ఫూర్తి, మాజీ ప్రధానమంత్రి, ‘భారతరత్న’ గౌరవనీయులైన అటల్ బిహారీ వాజ్‌పేయిజీ వర్ధంతి సందర్భంగా ఆయనకు వినయపూర్వకమైన నివాళులు! మీ స్వచ్ఛమైన రాజకీయ, ప్రజా జీవితం ఎప్పుడూ ప్రజాస్వామ్యానికి ఆదర్శప్రాయంగా ఉంటుంది’ అంటూ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్విట్టర్‌లో ఘనంగా నివాళులు అర్పించారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా నివాళులర్పిస్తూ “మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా ఆయనకు నా నివాళులు” అని ట్వీట్ చేశారు.

 వాజపేయి వర్ధంతి సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్‌ వేదికగా నివాళి అర్పిస్తూ వాజపేయి దేశ గమనాన్ని మార్చిన గొప్ప నేత అని కొనియాడారు. ఆధునిక భారత్ నిర్మాణంలో అటల్‌జీ కీలక పాత్ర పోషించారని పేర్కొంటూ ఆయన పాలనా కాలంలో ఊపిరిపోసుకున్న స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్, టెలికాం, సూక్ష్మసేద్యం, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్, ఓపెన్ స్కై పాలసీ, పోర్థుల వంటి కీలక సంస్కరణల్లో ఆయనతో కలిసి పనిచేయడం తనకు ఎంతో తృప్తిని ఇచ్చిన అంశమని తెలిపారు. దేశంలోని అభివృద్ధి చెందిన రోడ్లలో సగం వాజపేయి పాలనలో అభివృద్ధి చేసినవేనని చెప్పారు.