దేశ విభజన ఘర్షణల్లో మరణించిన వారికి మోదీ నివాళులు

దేశ విభజననాటి అత్యంత భయానక సంఘటనలను గుర్తు చేసుకునే రోజును పాటిస్తున్న సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆనాటి మత ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయినవారికి నివాళులర్పించారు. దేశ విభజన వల్ల అనేక కష్టనష్టాలను ఎదుర్కొని, సాహసోపేతంగా పట్టుదలతో కృషి చేసి, నిలదొక్కుకున్న వారిని ప్రశంసించారు.
మోదీ ఆదివారం ఇచ్చిన ట్వీట్‌లో, ఆగస్టు 14ను దేశ విభజననాటి భయానక పరిస్థితులను గుర్తు చేసుకునే రోజుగా పాటిస్తున్న నేపథ్యంలో దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని తెలిపారు. మన చరిత్రలో విషాదకర సమయంలో కష్టనష్టాలకు గురై, పట్టుదల, తట్టుకునే సామర్థ్యంతో అభివృద్ధి కోసం పాటుపడుతున్నవారందరినీ అభినందిస్తున్నట్లు తెలిపారు.
మోదీ గత ఏడాది స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ప్రసంగిస్తూ, ఆగస్టు 14ను దేశ విభజన నాటి భయానక పరిస్థితులను గుర్తు చేసుకునే రోజుగా ప్రకటించారు.
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  ఆదివారం ఇచ్చిన ట్వీట్‌లో, భారత దేశాన్ని విభజించిన అత్యంత విషాదకర సమయంలో విధ్వంసకర మతపరమైన ఆలోచనా ధోరణి కారణంగా లక్షలాది మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారని, కోట్లాది మంది అమానవీయ కష్టనష్టాలకు గురయ్యారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆదివారం ఇచ్చిన ట్వీట్‌లో, పాకిస్థాన్ ఏర్పాటైన తర్వాత లక్షలాది మంది నిరాశ్రయులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత దేశ చరిత్రలో అవి అంధకార క్షణాలని పేర్కొన్నారు. అఖండ భారత్‌కు పెద్ద దెబ్బ తగిలిందన్నారు. బ్రిటిష్ పాలకులు, కొత్తగా ఏర్పాటైన పాకిస్థాన్ దుస్తంత్రాల వల్ల ప్రజలు అనుభవించిన బాధలను గుర్తు చేసుకుంటున్నట్లు తెలిపారు.