నాణ్యతా ప్రమాణాల లోపంతోనే విద్యుత్ వాహనాల దగ్ధం 

రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోలు, డీజిల్‌ ధరలతో వాహనదారులు తమ వాహనాన్ని బయటకు తీయాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపధ్యంలో రానున్న రోజుల్లో పెట్రోల్‌, డీజిల్‌ వినియోగాన్ని తగ్గించి ప్రజల్ని ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ)ల వైపు మళ్లించాలని ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. 
 
దీని కోసం ఈవీలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాయి. దీంతో చాలా మంది ప్రజలు పెట్రోల్‌ బాధలు తప్పుతాయని  ఎలక్ట్రిక్‌ బైకులను, కార్లను కొనుగోలు చేస్తున్నారు. కార్ల విషయంలో కంపెనీలు నాణ్యత ప్రమాణాలు పాటించి వినియోగదారులకు మెరుగైన ప్రొడక్ట్స్‌ అందించాయి. అయితే ఎలక్ట్రిక్‌ టూవీలర్ల విషయంలో మాత్రం నాణ్యతా ప్రమాణాలను గాలికొదిలేస్తున్నారు. 
 
చాలా ప్రమాదాలు బ్యాటరీ లోపాలు, షార్ట్ సర్యూట్ కారణంగానే జరిగాయని గుర్తించింది. ‘సెల్ఫ్ వెంటింగ్ మెకానిజంలో తీవ్ర లోపాలు’ ఉన్నాయని గుర్తించింది. దీంతో ఎలక్ట్రికల్‌ బైక్స్‌ తరచూ అగ్ని ప్రమాదాలకు గురవుతున్నాయి. ఛార్జింగ్‌ పెడుతున్న సమయంలో, బైక్‌ నడుపుతున్న సమయాల్లో ఎలక్ట్రిక్‌ బైకులు అగ్నిప్రమాదాలకు గురవుతున్నాయి.
ఈ ప్రమాదాల్లో కొందరు వాహనచోదకులు సైతం తమ ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయాన్ని సీరియస్‌ గా తీసుకున్న కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ ఈ ప్రమాదాలపై నిపుణుల కమిటీని నియమించింది.

బ్యాటరీల నిర్వహణ వ్యవస్థ, ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల్లో ఉపయోగించే సెల్స్‌ వెంటింగ్‌ మెకానిజంలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని నిపుణుల  కమిటీ గుర్తించింది. నాసిరకం వాహనాలను విక్రయించిన మూడు ఈవీ తయారీ కంపెనీలపై భారీ జరిమానా వేయాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. దీనికి అనుగుణంగానే సదరు ఈవీ కంపెనీలకు ప్రభుత్వం భారీ జరిమానాని విధించింది.

తమిళనాడు వెల్లూర్‌ ఘటన తర్వాత పలు రాష్ట్రాల్లో తరచూ ఎలక్ట్రిక్‌ వాహనాలు అగ్ని ప్రమాదాలకు గురైన సంఘటనలు పునరావృతమయ్యాయి. కేవలం ఈవీలు షార్ట్‌ సర్క్యూట్‌ అవడం బ్యాటరీల్లో నాణ్యతా లోపాల వల్లే జరిగాయని నిపుణుల కమిటీ తేల్చింది. వరస అగ్ని ప్రమాదాల తరువాత ఈవీ కంపెనీలు నిర్లక్ష్యానికి పాల్పడితే భారీ జరిమానాలతో పాటు రీకాల్‌ చేస్తామని గతంలో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ హెచ్చరించారు.