పెరంబూర్‌లో రూపుదిద్దుకుంటున్న ‘వందే భారత్‌’ రైలు

తమిళనాడులోని పెరంబూర్‌లో గల ఇంటెగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో అత్యాధునిక వసతులతో ఒక్కొక్క ‘వందే భారత్‌’ రైలు రూ.110 కోట్లతో రూపుదిద్దుకుంటోందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ తెలిపారు. శుక్రవారం ఆయన ఐసీఎఫ్‏లోని బోగీల తయారీ కర్మాగారాన్ని పరిశీలించారు. 

అంతర్జాతీయ ప్రమాణాలతో 102 వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలు ఐసీఎ్‌ఫలో తయారవుతున్నాయి. గంటకు 180 కి.మీ వేగంతో వెళ్లే ఈ రైల్లో 1,000 మంది ప్రయాణించవచ్చు. ట్రయల్‌ రన్‌ అనంతరం మొట్టమొదటి వందే భారత్‌ రైలు నెలాఖరు నాటికి రైల్వే బోర్డుకు అప్పగించేందుకు ఐసీఎఫ్‌ సన్నాహాలు చేపట్టింది. 

మెరుగైన వసతులతో కూడిన వందే భారత్‌ తొలి రైలును రైల్వే మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ పరిశీలించారు. రైలు బోగీల్లో కల్పించిన ఆధునిక అంశాలు, వసతులను అధికారుల వద్ద అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ… ప్రధాని మోదీ సూచనల మేరకు దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సేవలందించేలా వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడపనున్నామని ప్రకటించారు. 

దక్షిణ రైల్వే అధికారులు ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంలో మిగతా జోన్ల కంటే ముందున్నారని కేంద్ర మంత్రి ప్రశంసించారు. ఐసీఎఫ్‏లో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ తయారుచేయడం చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని తెలిపారు. ఐసీఎఫ్‌ కర్మాగారంలో ప్రయాణికులకు ఆధునిక వసతులతో బోగీలు తయారుచేస్తున్నారని ఉద్యోగులను మంత్రి అభినందించారు. 

వచ్చే ఏడాది ఆగష్టు నాటికి 75 వందే భారత్ రైళ్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి రైలును 2019 మే 15న న్యూ ఢిల్లీ- కాన్పూర్- అలాహాబాద్ ల మధ్య ప్రారంభించారు. నెలకు 7 నుండి 8 వందే భారత్ రైళ్లను తయారు చేయగల సామర్థ్యం ఐసిఎఫ్ కు ఉండగా, దానిని 10కు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రైళ్లలో ప్రయాణీకులకు మెరుగైన భద్రతా, ఇతర సదుపాయాలను సమకూరుస్తున్నారు. 

రైల్వే స్టేషన్ల వద్దా, ఎదురెదురుగా రైళ్లు వస్తున్న సమయంలో సిగ్నల్ సమస్య ఎదురైనప్పుడు రక్షణ కల్పించే `కవచ్’ ప్రధానమైన భద్రతా విధానాన్ని ఇందులో ప్రవేశ పెడుతున్నారు. రైలులోని అన్ని విద్యుత్ పరికరాలను, ఏసీ పర్యవేక్షణను కేంద్రీకృతంగా ఓకే వ్యక్తి పర్యవేక్షించే సదుపాయం ఉంటుంది. 

మంత్రితో పాటు దక్షిణ రైల్వే జనరల్‌ మేనేజర్‌ బీజీ మాల్యా, ఐసీఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఏకే అగర్వాల్‌, ఐసీఎఫ్‌ చీఫ్‌ మెకానికల్‌ ఇంజనీర్‌ ఎస్‌. శ్రీనివాస్‌ తదితర అధికారులు కూడా రైల్వేమంత్రి వెంట వున్నారు.