బుల్‌డోజర్‍తో బిజెపి కార్యకర్త ఇల్లు కూల్చివేత

ఉత్తర్‌ప్రదేశ్‌లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.  యోగి ఆదిత్యనాథ్   ప్రభుత్వం సొంత పార్టీ కార్యకర్తనూ ఉపేక్షించలేదు. బీజేపీ కార్యకర్త శ్రీకాంత్‌ త్యాగి ఇంటి వద్ద అక్రమ నిర్మాణాని బుల్‌డోజర్లతో కూల్చివేశారు అధికారులు. నోయిడా సెక్టార్ 93లోని గ్రాండ్‌ ఒమాక్సీ హౌసింగ్‌ సొసైటీలో ఉన్న ఈ ఇంటికి సోమవారం ఉదయం పోలీసు బృందాలతో వెళ్లారు. అనంతరం త్యాగి ఇంటి ముందు భాగాన్ని కూలగొట్టారు.
శ్రీకాంత్ త్యాగి ఇదే హౌసింగ్ సొసైటిలోని ఓ మహిళపై దాడి చేసిన  కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో పొరుగింటి మహిళను కొట్టడమే గాక దుర్భాషలాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటనకు బాధ్యుడై వార్తల్లో నిలిచిన బీజేపీ కిసాన్ మోర్చా సభ్యుడు శ్రీకాంత్ త్యాగి విషయంలో యోగి ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంది. 

బుల్డొజర్‌‌ను పంపి శ్రీకాంత్ త్యాగికి చెందిన అక్రమ ఇంటిని యోగి సర్కార్ కూల్చేసిందిదీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. మహిళను శ్రీకాంత్ త్యాగి బెదిరించిన సమయంలో అతనికి మద్దతుగా నిలిచిన వారిని కూడా పోలీసులు విచారించారు.

శ్రీకాంత్ త్యాగి ఇంటి ముందు అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని హౌసింగ్ సొసైటీ సంఘం 2019లోనే ఫిర్యాదు చేసింది. నోయిడా అధికారులు 2020లోనే త్యాగికి నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు నేరుగా బుల్‌డోజర్లతో వెళ్లి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు.

కొన్ని రోజుల క్రితం త్యాగికి, గ్రాండ్ ఒమాక్స్ సొసైటీకి చెందిన ఒక మహిళకు మధ్య వాగ్వాదం జరిగింది. త్యాగి తను ఉంటున్న సొసైటీలో కొన్ని మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నాడు. అయితే.. గ్రాండ్ ఒమాక్స్ సొసైటీ నిబంధనల ప్రకారం మొక్కలు నాటకూడదనేది ఆ సొసైటీ పెట్టుకున్న రూల్. 

త్యాగికి ఆ నిబంధనను సదరు మహిళ గుర్తుచేసింది. ఈ విషయంలో త్యాగి ఆమెతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తనకు కూడా సొసైటీలో హక్కు ఉందని త్యాగి వాదించాడు. ఈ గొడవలో విచక్షణ కోల్పోయిన శ్రీకాంత్ త్యాగి ఆ మహిళపై చేయి చేసుకున్నాడు. ఆమెపై దాడికి దిగిన ఆ దృశ్యాలను అక్కడ ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం బయటకు వచ్చింది.