సంజయ్ రౌత్‌ భార్య వర్షా రౌత్‌కు ఇడి సమన్లు

భూ కుంభకోణం కేసులో శివసేన నేత సంజయ్  రౌత్‌ భార్య వర్షా రౌత్‌కు ఇడి సమన్లు జారీ చేసింది. సంజయ్  రౌత్‌ ఇడి కస్టడీని ఆగస్ట్‌ 8 వరకు పొడిగిస్తూ ముంబయి ప్రత్యేక కోర్టు ఆదేశాలిచ్చిన కొన్ని గంటల అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది. 

వర్ష రౌత్‌ ఖాతాల ద్వారా లావాదేవీలు జరిపినట్లు బయటకి రావటంతో ఈ సమన్లు జారీ చేసినట్లు ఈడీ పేర్కొంది. గుర్తు తెలియని వ్యక్తి నుంచి వర్ష రౌత్‌ ఖాతాలోకి సుమారు రూ.1.08 కోట్లు నగదు వచ్చినట్లు పేర్కొంది. వర్షా రౌత్‌కు సంబంధించిన కొన్ని ఆస్తులు కూడా ఈ కేసుతో లింక్‌ కలిగి ఉన్నాయని, ఇప్పటివరకు ఆమెను విచారించలేదని ఇడి పేర్కొంది.

 తనను వెంటిలేషన్‌ లేని గదిలో ఉంచుతున్నారని సంజయ్  రౌత్‌ కోర్టుకు తెలిపారు. అయితే ఆయనను ఎయిర్‌కండీషన్డ్‌ గదిలో ఉంచి విచారణ జరుపుతున్నట్లు ఇడి తెలిపింది.

సంజయ్  రౌత్‌ సన్నిహితులతో పాటు వర్షా రౌత్‌కు చెందిన రూ.11 కోట్ల విలువైన ఆస్తులను నాలుగు నెలల క్రితం ఇడి జప్తు చేసిన సంగతి తెలిసిందే.  దాదర్‌లో వర్షారౌత్‌ పేరిట ఉన్న ఒక ఫ్లాట్‌, అలీబాగ్‌లోని కిహిమ్‌ బీచ్‌లో వర్షరౌత్‌, సంజయ్  సన్నిహితుడు సుజిత్‌ పాట్కర్‌ భార్య స్వప్న పాట్కర్‌లు  సంయుక్తంగా  కలిగి ఉన్న  ఎనిమిది ఫ్లాట్లు ఇందులో ఉన్నాయి.