అర్పితా ముఖర్జీ కంపెనీల్లో ఓ కార్ డ్రైవర్ డైరెక్టర్ 

పశ్చిమ బెంగాల్ లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఉపాధ్యాయుల ఎంపిక కుంభకోణంలో కీలక నిందితురాలిగా, ప్రస్తుతం అరెస్ట్ లో ఉన్న ప్రధాన నిందితుడు, మాజీ మంత్రి పార్థసారథి చట్టర్జీ సన్నిహితురాలైన    అర్పితా ముఖర్జీ అనుమానాస్పద ఆర్ధిక కార్యకలాపాలు ఒకొక్కటి వెలుగులోకి వస్తున్నాయి.  మోడల్, నటి అయిన ఆమె మూడు కంపెనీల్లో డైరెక్టరుగా ఉండగా, అదే కంపెనీలో ఆమెతో పాటు ఓ డ్రైవర్ కూడా మరో డైరెక్టర్ గా ఉండడం గమనార్హం. 
 
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం కోల్‌కతా నగరానికి చెందిన కల్యాణ్ ధర్ అనే వ్యక్తి కూడా ఆ మూడు కంపెనీల్లో కో డైరెక్టరని తేలింది. కళ్యాణ్ ధర్ గురించి ఆరా తీస్తే ఆయన నిజ జీవితంలో కారు డ్రైవరుగా పనిచేస్తున్నారని తేలింది.  ఓ కారు డ్రైవర్ కోట్లాది రూపాయల టర్నోవర్ ఉన్న అర్పిత ముఖర్జీకి చెందిన మూడు కంపెనీల్లో డైరెక్టరుగా ఎలా ఉన్నాడనేది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది.
మనీలాండరింగ్ కేసులో దర్యాప్తు చేస్తున్న ఈడీ తాజాగా అర్పితా కంపెనీల్లో కో డైరెక్టరు అయిన కల్యాణ్ ధర్ పై దృష్టి పెట్టింది.  కారు డ్రైవర్ అయిన ఈయనకు కనీసం ద్విచక్రవాహనం కూడా లేదని దర్యాప్తులో తేలింది.  అర్పితా ముఖర్జీ సింబయాసిస్ మర్చంట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట కోల్‌కతా కేంద్రంగా హోల్ సేల్ వెరైటీ వస్తువుల వ్యాపార సంస్థను నెలకొల్పి, అందులో కారు డ్రైవరు కల్యాణ్ ధర్ ను డైరెక్టరును చేశారు.
అర్పితా సెంట్రీ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట మరో కంపెనీని నెలకొల్పి అందులోనూ కారు డ్రైవరును డైరెక్టరును చేశారు. అర్పితా ఎచ్చే ఎంటైర్‌టైన్‌మెంటు ప్రైవేటు లిమిటెడ్ పేరిట 2014లో ఏర్పాటు చేసిన కంపెనీలోనూ కారు డ్రైవరును డైరెక్టరుగా నియమించారు.  అర్పితా కంపెనీల్లో కో డైరెక్టరుగా ఉన్న కల్యాణ్ ధర్ కోల్ కతా నగరంలో అతి చిన్న ఇంట్లో నివాసముంటున్నాడని ఈడీ దాడుల్లో వెలుగుచూసింది.
కల్యాణ్ ధర్ భార్య అర్పితా ముఖర్జీ చెల్లెలని దర్యాప్తులో వెల్లడవడం విశేషం. కల్యాణ్ ధర్ వేరేవారి కారుకు డ్రైవరుగా పనిచేస్తుండగా, అతని భార్య అయిన అర్పితా చెల్లెలు పాఠశాలలో గ్రూప్ డి ఉద్యోగం చేస్తున్నారని తేలింది. స్కాంలో వసూలు చేసిన అవినీతి సొమ్మును దాచుకునేందుకు బోగస్ చిరునామాలతో సూట్ కేస్ కంపెనీలు, డమ్మీ డైరెక్టరును అర్పితా ముఖర్జీ నియమించారని వెల్లడైంది.