సుప్రీంకోర్టు తదుపరి చీఫ్‌ జస్టిస్‌గా యూయూ లలిత్‌

49వ భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ (యుయు లలిత్) నియమితులయ్యే అవకాశాలు కనిపిిస్తున్నాయి. లలిత్ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ ప్రతిపాదించారు. ప్రస్తుత సిజెఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ ఈ నెల 26వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు.

ఈ నేపథ్యంలో  ఆయన ఫేరును సిఫార్సు చేస్తూ కేంద్ర న్యాయ శాఖకు గురువారం ఉదయం జస్టిస్‌ ఎన్‌.వి. రమణ లేఖ రాశారు.   జస్టిస్‌ ఎన్‌.వి. రమణ లేఖను కేంద్ర న్యాయశాఖ ప్రధానమంత్రి పరిశీలన కోసం పంపనుంది. ఆయన ఆమోదం తర్వాత రాష్ట్రపతికి చేరుకుంటుంది. అంతిమ నిర్ణయం రాష్ట్రపతిదే.

రాష్ట్రపతి ఆమోదిస్తే తదుపరి ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపడతారు. సంప్రదాయం ప్రకారం సిజెఐ తన తర్వాత ఆ పదవిని చేపట్టేందుకు సుప్రీంకోర్టులోని అత్యంత సీనియర్‌ న్యాయమూర్తి పేరును సిఫార్సు చేస్తారు. ఆ లెక్కన జస్టిస్‌ ఎన్‌.వి.రమణ తర్వాత జస్టిస్‌ యు.యు.లలిత్‌ అత్యంత సీనియర్‌గా ఉన్నారు.

జస్టిస్‌ లలిత్‌ ఆగస్టు 27న ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.  అయితే ఆయన మూడు నెలల మాత్రమే ఈ పదవిలో కొనసాగుతారు. నవంబరు 8న ఆయన పదవీ విరమణ చేస్తారు. జస్టిస్ లలిత్ తర్వాత జస్టిస్ చంద్రచూడ్ సిజెఐ అయ్యే అవకాశాలున్నాయి.  ఆయన   ఆ పదవిలో రెండేళ్ల పాటు  కొనసాగనున్నారు.

ప్రస్తుతం యూయూ లలిత్ సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. న్యాయమూర్తి కంటే ముందు సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. జస్టిస్ లలిత్ సుప్రీంకోర్టుకు నేరుగా పదోన్నతి పొందిన 6వ సీనియర్ న్యాయవాది.