ఉచిత పథకాల ప్రకటనల నియంత్రణపై సూచనలు కోరిన `సుప్రీం’

 
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం ఉచిత హామీలతో ప్రజలను మభ్య పెట్టపెట్టడం వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న కేంద్రం వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. ప్రచార సమయంలో రాజకీయ పార్టీల ఉచిత పథకాల ప్రకటనలను ఎలా నియంత్రించాలనే దానిపై సూచనలు సమర్పించాలని కేంద్రం, ఎన్నికల సంఘం, సీనియర్ న్యాయవాది, రాజ్యసభ ఎంపీ కపిల్ సబిల్, పిటిషనర్లను సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సూచించింది. 
 
సూచనల కోసం నీతి ఆయోగ్, ఫైనాన్స్ కమిషన్, అధికార, ప్రతిపక్ష పార్టీలు, ఆర్బీఐతో కూడిన ఎపిక్స్ బాడీ అవసరమని ధర్మానసం పేర్కొంది. నిపుణుల సంఘం ఏర్పాటుపై వారంరోజుల్లోగా తమ సూచలను సమర్పించాలని ఆదేశించింది.  ఎన్నికల సమయంలో ఉచిత హామీల ద్వారా ఓటర్లను ప్రేరేపిస్తున్న రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు చేయాలని కోరుతూ సీనియర్ న్యాయవాది, బీజేపీ అధికార ప్రతినిధి అశ్విని  కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది.
కేంద్రం తరఫున హాజరైన తుషార్ మెహతా తన వాదన వినిపిస్తూ, ప్రజాకర్షణ ప్రకటనలు ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయని, ఇది ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని అన్నారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ, వీటి వల్ల ధనవంతులే కాకుండా పేదలు కూడా లబ్ధి పొందుతున్నారని, దీనిపై ఏమేరకు చెక్ చేయగలమనేదే అసలు ప్రశ్న అని తెలిపారు.
పిటిషనర్ తరఫున హాజరైన సీనియర్ అడ్వకేట్ వికాస్ సింగ్ తన వాదన వినిపిస్తూ, ఎవరి జేబుల్లోంచి డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయనేది పరిగణనలోకి తీసుకోవాలని, అప్పుడే ఆ విషయం ఓటరుకు తెలుస్తుందని అన్నారు. ఈ విషయమై ఎన్నికల సంఘాన్ని మళ్లీ పరిశీలించనివ్వాలని అన్నారు. దీనికి సీజేఐ స్పందిస్తూ, ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునేటప్పుడు వివిధ కోణాల నుంచి పరిశీలించాల్సి ఉంటుందని అన్నారు.
కాగా, ఈ అంశాన్ని ఎన్నికల కమిషన్‌కు నివేదించరాదని సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ స్పష్టం చేశారు. ఈసీఐని దీనికి దూరంగా ఉంచాలని కోరారు. ఇది ఆర్థిక, రాజకీయ సమస్య అని, ఎకనామిస్ట్ ఇష్యూ అని పేర్కొన్నారు. సిబల్ వాదనను మెహతా వ్యతిరేకించారు.
 సిబల్ తన వాదన కొనసాగిస్తూ, మొదట పార్లమెంటులో చర్చ జరగాలని, ఒక అభిప్రాయం అంటూ వచ్చిన తర్వాత, ఫైనాన్స్ కమిషన్ సూచనలు చేయవచ్చని, దానిని ప్రభుత్వం ఆమోదించవచ్చని తెలిపారు. ఈ వాదనతో మెహతా విభేదిస్తూ, ఆయన ఇచ్చిన సూచనలు సమస్యను పరిష్కరించవని పేర్కొన్నారు.
సీజేఐ స్పందిస్తూ ”ఈ అంశంపై పార్లమెంటు చర్చిస్తుందని మీరు అనుకుంటునారా? ఏ రాజకీయ పార్టీ ఇందుకు ఒప్పుకుంటుంది? ఎందుకంటే ప్రతి ఒక్కరికీ ఉచితాలు కావాలి. వాస్తవం అలా ఉంది. రాజకీయ పార్టీల విజ్‌డమ్‌పై నేను కామెంట్ చేయడం లేదు” అని స్పష్టం చేశారు.
అంతిమంగా, పన్నులు చెల్లించేవారు, సామాన్య ప్రజలు ఏమి అనుకుంటున్నారనేదే ముఖ్యం అని అయన తెలిపారు. ఇవన్నీ విధానపరమైన అంశాలని, అలాగే వీటిపై కోర్టులు ఎంతవరకూ వెళ్లగలవు అనే దానిపై కూడా పరిమితులుంటాయమని చెప్పారు. అందువల్లే ప్రతి ఒక్కరూ ఈ అంశంపై చర్చలో పాల్గొనాలని తాము ఆశిస్తున్నామని పేర్కొన్నారు.
 ఈ అంశంతో ముడిపడి ఉన్న అందరూ చర్చించుకుని ప్రభుత్వానికి సిఫారసు చేస్తే, ఈసీఐ దానిని అమలు చేస్తుందని, దీనిపై సమగ్ర నివేదికను కోర్టుకు సమర్పించాలని సీజేఐ ఆదేశించారు.