సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌గా సురేష్ ఎన్ పటేల్

సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌గా  సురేశ్ ఎన్ పటేల్ నియమితులయ్యారు. ఈ ఏడాది జూన్ నుండి తాత్కాలిక సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సివిసి)గా పనిచేస్తున్నారు. రాష్ట్రపతి భవన్‌లో  సురేష్‌ పటేల్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ విడుద‌ల చేసిన‌ ఓ ప్రకటనలో పేర్కొంది.  
 
ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. సీవీసీగా పటేల్ నియామకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇటీవల ఆమోదించింది. ఏడాది కాలంగా ఈ పోస్టు ఖాళీగానే ఉంది. దీంతో ఈ ఏడాది జూన్‌లో తాత్కాలిక సీవీసీగా సురేష్ ఎన్ పటేల్ ని నియ‌మించారు.
ఆంధ్రా బ్యాంక్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన పటేల్.. ఏప్రిల్ 2020లో విజిలెన్స్ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) మాజీ అధికారి సంజయ్ కొఠారీ గత ఏడాది జూన్ 24న సీవీసీగా పదవీకాలం పూర్తి చేశారు. సీవీసీ, విజిలెన్స్‌ కమిషనర్లను నిర్ణయించేందుకు ప్రధాని నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల సెలక్షన్ ప్యానెల్ జూలైలో సమావేశమైంది.
ఈ సమావేశంలో సీవీసీగా పటేల్ నియామకాన్ని ప్యానెల్ ఆమోదించింది.విజిలెన్స్ కమిషనర్లుగా మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అరవింద్ కుమార్, మాజీ వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి అవినాష్ కుమార్ శ్రీవాస్తవ నియామకాలకు కూడా ప్యానెల్ ఆమోదం తెలిపింది.
అరవింద్ కుమార్ ఈ ఏడాది జూన్ 30న అంతర్గత భద్రతా గూఢచార సంస్థ చీఫ్‌గా పదవీకాలం పూర్తి చేశారు. అవినాష్ కుమార్ శ్రీవాస్తవ ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన 1982 బ్యాచ్ ఐఎఎస్ అధికారి, జనవరి 2020లో వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు.