బిజెపి లోకి హర్యానా కాంగ్రెస్ ఎమ్యెల్యే, ఇద్దరు గుజరాత్ నేతలు

బుధవారం అసెంబ్లీకి రాజీనామా చేసిన హర్యానాలోని  కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కుల్‌దీప్ బిష్ణోయ్ మాత్రమే కాకుండా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఇద్దరు కాంగ్రెస్ నేతలు బిజెపిలోకి చేరేందుకు రంగం సిద్దమైంది.  బిష్ణోయ్ తన రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ స్పీకర్ జ్ఞాన్ చంద్ గుప్తాకు అందజేశారు. 
 
గురువారంనాడు ఆయన బీజేపీలో చేరనున్నారు. ఆయన రాజీనామాతో ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హిసార్ జిల్లా అదంపూర్ నియోజకవర్గాంలో ఉప ఎన్నిక అనివార్యం కానుంది. రాజ్యసభ ఉప ఎన్నికల్లో బిష్ణోయ్ క్రాస్ ఓటింగ్ చేయడంతో ఆయనను పార్టీలోని అన్ని పదవుల నుంచి కాంగ్రెస్ తొలగించింది.
 
తనను రాజీనామా చేయాలని బీఎస్ హుడా సవాల్  చేశారని, దానిని తాను స్వీకరించానని  చెబుతూ,   ఆదంపూర్ నియోజకవర్గం నుంచి తనపై పోటీచేసి గెలవాలని ఇప్పుడు తాను ఆయనకు (హుడా) సవాల్ చేస్తున్నానని ఆయన ప్రకటించారు., 4న తన మద్దతుదారులతో కలిసి బీజేపీలో చేరుతానని ప్రకటించారు.
 
బిష్ణోయ్ ఇటీవల కాలంలో బీజేపీ అగ్రనేతలను కలుసుకున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ చీఫ్ నడ్డా, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ తదితరులతో సమావేశమయ్యారు. బిష్ణోయ్ తండ్రి, మాజీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి  భజన్ లాల్ హర్యానా జనహిత్ కాంగ్రెస్ (హెచ్‌జేసీ) పార్టీని 2007లో ప్రారంభించారు.
 
మరోవంక, గుజరాత్ లో  మెహ్‌సనా జిల్లా విజపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మాజీ హోంశాఖ మంత్రి నరేష్ రావల్ కాంగ్రెస్ పార్టీ నుండి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.  పార్టీతో అనేక విషయాల్లో తనకు అభిప్రాయభేదాలున్నాయని, అయితే ఆ అంశాలు ఇప్పుడు ప్రస్తావించాలనుకోవడం లేదని చెప్పారు. త్వరలోనే బీజేపీలో చేరుతానని, ఆ పార్టీ నాయకత్వం ఏ పని అప్పగించినా పనిచేయడానికి సిద్ధమేనని తెలిపారు.
కాంగ్రెస్ మరో నేత, రాజ్యసభ మాజీ ఎంపీ రాజు పర్మర్ కూడా కాంగ్రెస్ పార్టీతో తనకు 35 ఏళ్లుగా అనుబంధంను తుంచుకొంటూ రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.  పార్టీ నాయకత్వం కొత్త వారికి ప్రాధాన్యం ఇవ్వడం మొదలు పెట్టిందని, పార్టీ నుంచి ఎలాంటి పదవులు, ఫేవర్స్ ఆశించనప్పటికీ పార్టీకి సేవలందించే అవకాశం తనకు ఇవ్వకపోవడం దురదృష్టకరమని చెప్పారు. మరింత మంది సీనియర్ నేతలు కూడా త్వరలో పార్టీని వీడనున్నట్టు ఆయన తెలిపారు.