విశాఖ స్టీల్ ప్లాంట్‌ ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడతాం

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయడంపై ఉద్యోగుల నుంచి విజ్ఞప్తులు అందినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఏ, ఉక్కు వ్యూహాత్మక రంగం కాదు కాబట్టి విలీనం గురించి ఆలోచించే అవకాశం లేదని భకేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవంత్ కరాడ్ రాజ్యసభలో స్పష్టం చేశారు. చట్టబద్ధమైన ఉద్యోగుల సమస్యలను వాటా కొనుగోలు ఒప్పందం నిబంధనలకు అనుగుణంగా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోందని, లావాదేవీల సలహాదారు, న్యాయ సలహాదారు బిడ్డింగ్ ద్వారా వివిధ దశలు పూర్తయ్యాయని ఆయన తెలిపారు.
ఆర్‌ఐఎన్‌ఎల్‌లో 5,190 మంది ఎగ్జిక్యూటివ్‌లు, 10,583 మంది నాన్‌ ఎగ్జిక్యూటివ్‌లు పర్మినెంట్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్నారని, మరో 16,816 మంది ఉద్యోగులు కాంట్రాక్ట్‌ కార్మికులుగా ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్టర్ల ద్వారా పని చేస్తున్నారని ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్‌సింగ్‌ కులస్తే పేర్కొన్నారు.
వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు ఆర్‌ఐఎన్‌ఎల్‌ యాజమాన్యం వివిధ యూనియన్‌లతో చర్చలు జరిపిందని, మూలధనం కోసం పెట్టుబడుల ఉపసంహరణ ఆవశ్యకతను వెల్లడించిందని కేంద్రమంత్రి చెప్పారు.
రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌‌)ను సెయిల్‌లో విలీనం చేసేందుకు ఉద్యోగ సంఘాల నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వచ్చాయా, స్టీల్ ప్లాంట్‌ల పెట్టుబడుల ఉపసంహరణపై ఉద్యోగుల విషయంలో తదుపరి చర్యలేంటని బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రులు ఈ అంశాలను వెల్లడించారు.
ప్రైవేటీకరణ వల్ల ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనలపై దృష్టి పెడతామని కులస్తే తెలిపారు. ఆర్‌ఐఎన్‌ఎల్‌లో 30 వేల మంది ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు తాను కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ వారి ప్రయోజనాలను పరిరక్షించే “విన్-విన్ పాలసీ”ని రూపొందించడానికి వాటాదారులతో మాట్లాడుతున్నానని వివరించారు.