సగటున 21 రోజులే సమావేశమైన రాష్ట్రాల అసెంబ్లీలు 

రాష్ట్రాల అసెంబ్లీలు 2021లో సగటున 21 రోజుల పాటు మాత్రమే సమావేశం అయ్యాయి. పలు విషయాలకు సంబంధించి 500కు పైగా బిల్లులను ఆమోదించాయి. ఉన్నత విద్య, ఆన్‌లైన్ గేమింగ్, మతమార్పిడులు, పశువుల సంరక్షణ వంటి పలు అంశాలతో కూడిన బిల్లులు ఆమోదం పొందాయి. 

ఈ విషయాన్ని లెజిస్లేటివ్ విషయాల ఆలోచనా వేదిక పిఆర్‌ఎస్ తమ నివేదికలో తెలిపింది. ఆమోదం పొందిన బిల్లుల్లో అత్యధికంగా ఆదరాబాదరగా చట్టసభల పరిశీలనకు గురయ్యాయని, చాలా బిల్లులు ప్రవేశపెట్టిన రోజే ఆమోదం పొందాయని వెల్లడైంది. 

గత ఏడాది కర్నాటకలోనే అత్యధికంగా 48 బిల్లులు ఆమోదం పొందాయి. అంతకు ముందటి ఏడాది కూడా కర్నాటకలోనే ఎక్కువ బిల్లులు అంటే 55 బిల్లులు ఓకే అయ్యాయి. అత్యంత తక్కువగా డిల్లీలో 2, పుదుచ్చేరిలో 3, మిజొరాంలో 5 బిల్లులను ఆమోదించారు. 

దేశంలో 44 శాతం బిల్లులను ఒకే రోజులో ఆమోదించగా, గుజరాత్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, బీహార్ లతో సహా 8 రాష్ట్రాల్లో అన్ని బిల్లులను ప్రవేశపెట్టిన రోజే ఆమోదించారు. 

కాగా, కర్ణాటక, కేరళ, ఒడిశా, మేఘాలయ రాష్ట్రాల్లో సగంకు పైగా బిల్లుల ఆమోదంపై ఐదు కన్నా ఎక్కువ రోజులు తీసుకున్నారు. కేరళలో 94 శాతం బిల్లులను ప్రవేశపెట్టిన ఐదు రోజుల తర్వాత ఆమోదించగా, కర్ణాటకలో ఆ విధంగా 80 శాతం బిల్లులు, మేఘాలయాలో 70 శాతం బిల్లులు ఆమోదించారు. 

సాధారణంగా అయితే బిల్లులను చట్టసభలు క్షుణ్ణంగా పరిశీలించి, లోటుపాట్లను తగురీతిలో బేరీజువేసుకునే క్రమంలో తగు చర్చలు జరిగి తరువాత ఆమోద ప్రక్రియకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇందుకు భిన్నంగా బిల్లులను చర్చలకు ఆస్కారం లేకుండా ఆమోదిస్తున్నారని తెలిపింది.

కొన్ని సందర్భాలలో చట్టసభల సెషన్స్ చివరి రోజున సభ్యుల నిరాసక్తత, నిరసనలు గందరగోళాల నడుమ ఆమోదం పొందుతున్నాయి. దీనితో చట్టరూపం దాల్చే అంశాలలో ప్రామాణికతలు, న్యాయ, సహేతుకత వంటి అంశాలు ప్రశ్నార్థకం అవుతున్నాయని నివేదికలో తెలిపారు.

2021లో కేరళ ప్రభుత్వం అత్యధికంగా 144 ఆర్డినెన్స్‌లు వెలువరించింది. తరువాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్ 20, మహారాష్ట్ర 15 ఆర్థినెన్స్‌లు తీసుకువచ్చిందని పిఆర్ నివేదికలో తెలిపారు. బడ్జెట్ ప్రతిపాదనలు అమలులోకి వచ్చేందుకు ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో ఆర్డినెన్స్‌లు తీసుకువచ్చిన ఉదంతాలు ఉన్నాయి.