సంజయ్ రౌత్ ఇంట్లో ఈడీ మెరుపు దాడులు

శివసేన ఎంపి సంజయ్  రౌత్‌ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఆదివారం ఉదయం ఏడుగంటలకు దర్యాప్తు బృందం, సిఐఎస్‌ఎఫ్‌ అధికారులతో కలిసి ముంబయి తూర్పు శివారులోని   సంజయ్  నివాసానికి చేరుకుని సోదాలు చేపట్టారు. పత్రాచల్‌ భూ స్కాం కేసులో ఇడి  తనిఖీలు నిర్వహిస్తోంది.
 
పత్రాచల్‌ భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో సంజయ్  రౌత్‌కు ఇడి గతంలో రెండుసార్లు ఆయనకు సమన్లను జారీ చేసింది. కానీ, ఆయన ఇడి అధికారుల నోటీసులకు స్పందించలేదు. పార్లమెంట్‌ సమావేశాల పేరుతో విచారణకు గైర్హాజరయ్యారు.
 
 దీంతో ఇడి అధికారులు ఆదివారం తెల్లవారుజామున ముంబయిలోని రౌత్‌ నివాసానికి చేరుకుని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు సమాచారం. ఆయన ఇంటి వద్ద భారీ సంఖ్యలో సిఆర్‌పిఎఫ్‌ బలగాలు మోహరించాయి. సంజయ్  రౌత్‌ సన్నిహితులు ప్రవీణ్‌ రౌత్‌, సుజిత్‌ పాట్కర్‌లతో వ్యాపారం, ఇతర లింకులకు సంబంధించి, ఆయన భార్యకు సంబంధించిన ఆస్తి లావాదేవీల గురించి విచారించేందుకు ఇడి సమన్లు ఇచ్చింది.
గొరెగావ్‌ ప్రాంతంలోని పత్రాచాల్‌ అభివృద్ధి పేరుతో  రూ. 1,034 కోట్ల భూకుంభకోణం జరిగినట్లు ఇడి ఆరోపిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ప్రవీణ్‌ రౌత్‌ను ఇడి అరెస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నాడు. ఈడీ దాడులపై సంజయ్ రౌత్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ తాను ఎలాంటి తప్పు చేయలేదని, రాజకీయ పగతో టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో ఎలాంటి సాక్ష్యం లేదని, కావాలనే తనపై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారని చెప్పారు. 
 
కాగా, సమన్లు అందుకుని ఈడీ విచారణకు సంజయ్ రౌత్ హాజరుకాకపోవడం పై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఆయన నిర్దోషి అయితే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ ఆఫీస్ కు వెళ్లేందుకు ఎందుకు భయపడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ ప్రశ్నించారు. 
 
వరస ప్రెస్ కాన్ఫరెన్స్ లు పెట్టేందుకు సమయం ఉంది కానీ  దర్యాప్తు ఏజెన్సీ కార్యాలయాన్ని సందర్శించడానికి సమయం లేదా  అని నిలదీసేరు. సంజయ్ రౌత్‌కు ఈడీ జులై 20న సమన్లు ​పంపింది. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున ఆగస్టు 7 తర్వాత మాత్రమే హాజరుకావచ్చని తన లాయర్ల ద్వారా తెలియజేశారు.