పార్థ సారధి అవినీతి నుండి మమతా తప్పించుకోగలరా!

పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వ టీచర్ల ఉద్యోగాల కుంభకోణంలో అరెస్టైన పార్థా చటర్జీని మంత్రి పదవి నుండి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎట్టకేలకు తొలగించారు. అయితే అంతమాత్రం చేత ఆ మంత్రి అవినీతి చర్యల నుండి మమతా తన బాధ్యతను తప్పించుకోగలరా? అనే ప్రశ్న తలెత్తుతుంది. 
కళంకిత తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు పార్థ ఛటర్జీతో తనకున్న ‘సన్నిహిత సంబంధాన్ని’ ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దారితీసేందుకు ఆమె సాంస్కృతిక కార్యక్రమాల వేదికను ఉపయోగించుకుంటూ అతని చర్యలతో తనకేమీ సంబంధం లేదన్నట్లు స్పష్టం చేశారు. 

వర్ధమాన నటి, ఛటర్జీకి సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ఇళ్ల నుంచి రూ. 50 కోట్లకు పైగా నగదుతో పాటు భారీగా బంగారు ఆభరణాలు, విలువైన ఆస్తులు, అవినీతి చర్యలకు సంబంధించిన పత్రాలను పెద్ద ఎత్తున ఈడీ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో ఇంతటి భారీ కుంభకోణంకు కేవలం పార్థ సారధి వ్యక్తిగతంగా పాల్పడి వుండే అవకాశాలు కనిపించడం లేదు. 

2016 అసెంబ్లీ ఎన్నికల ముందు వెల్లడైన నారదా స్టింగ్ కుంభకోణం మినహా, తన పార్టీ నాయకుల అవినీతి చర్యలు బహిర్గత మైనప్పుడు అటువంటి వారిని మమతా వెనుకవేసుకు వచ్చేవారు. అయితే ఈ పర్యాయం తన మంత్రి చేష్టల పట్ల ఆమె `నిర్ల్పితం’గా వ్యవహరిస్తున్నారు. తప్పు రుజువైతే ఏదైనా శిక్ష వేసుకోండి అన్నట్టు మాట్లాడుతున్నారు.  భారీగా నగదు కట్టలు మీడియాలో వెల్లడి కావడంతో ఆ మంత్రిని గతంలో వలే `కాపాడే’ ప్రయత్నాలు ఆమె చేయలేక పోతున్నారు. 


ప్రస్తుతం వెల్లడైన భారీ ఉద్యోగ కుంభకోణంలో ఎందరు వ్యక్తులు ఉన్నారన్నది ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు. అయితే ఈ కుంభకోణంలో అనేకమంది `దళారులు’ ఉన్నారని, వారిలో ఎక్కువమంది అధికార టిఎంసి నాయకులే అన్నది స్పష్టం అవుతున్నది. 
 
ముఖ్యమంత్రి ఇప్పటి వరకు కుంభకోణం గురించి పూర్తిగా తెలియనట్లు నటిస్తున్నప్పటికీ, వాస్తవానికి బెనర్జీ స్వయంగా ఛటర్జీ వ్యవహారాలపై ఆరా తీశారని టిఎంసి వర్గాలు భావిస్తున్నాయి. ఈ సందర్భంగా టిఎంసి మాజీ ఎమ్యెల్యే అనంతదేబ్ అధికారి ఈ కుంభకోణంలో మమతా బెనర్జీకి “ప్రమేయం” ఉందని ఆరోపించడం రాజకీయ వర్గాలలో కలకలం సృష్టిస్తున్నది. 
 
ఛటర్జీకి ఉపాధ్యాయుల నియామకం కోసం ముఖ్యమంత్రి స్వయంగా  “సిఫార్సు లేఖలను ఛానలైజ్” చేసేవారని ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. పైగా, ప్రతి శాసనసభ్యుడికి ఐదు ఉద్యోగాల  కోటా ఇచ్చారని, పాఠశాల ఉపాధ్యాయ స్థానాల్లో “చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా” రిక్రూట్ చేశారని అధికారి ఆరోపించారు.

2016-2021 వరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన ఛటర్జీ పదవీకాలంలో ఈ మొత్తం కుంభకోణం జరిగింది. అంతకు ముందే పెద్ద నోట్ల రద్దు కావడంతో భారీగా నగదు చెలామణి కష్టంగా ఉన్న సమయంలో కూడా గుట్టల కొద్దీ నగదు ఆర్పీతా ఇళ్లల్లో దాచగలిగారంటే ఇదంతా ఓ పెద్ద విషవలయం అని స్పష్టం అవుతుంది. 

 
ఇదంతా అధికార పార్టీ మద్దతుతో, రాజకీయంగా బాగా ఆలోచించి చేసిన మంత్రాంగంగా భావించవలసి ఉంటుంది. ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా ఇంతటి భారీ పక్రియ ప్రభుత్వ యంత్రాంగం  కనుసన్నలలో జరిగే అవకాశం ఉండదు. అందుకనే ఈ కుంభకోణం బాధ్యత నుండి మమతా తప్పించుకోలేరని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 
 
డబ్బును వెలికితీసేందుకు తన ఇంటికి రావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులకు మమతా సవాల్ విసిరినా ఆమె ప్రమేయం లేకుండా చట్టర్జీ ఇంత పెద్ద రాకెట్ నడపడం అసాధ్యం అని చెప్పవచ్చు. ప్రస్తుతం, ఈడీ  అధికారులు పార్థ- అర్పిత అనుబంధం ద్వారా లాండరింగ్ చేసిన డబ్బును వెలికితీసే పనిలో నిమగ్నమై ఉన్నారు. 
 
ఛటర్జీ అరెస్టు చేసిన తర్వాత, అరెస్ట్ మెమోలో, ప్రస్తుత ముఖ్యమంత్రి పేరును పేర్కొన్నప్పటికీ దర్యాప్తు కోణాల నుండి ఆమె ఇప్పుడే తప్పించుకొనే అవకాశం లేదు.