బిజెపితో 38 మంది టిఎంసి ఎంఎల్‌ఏలు బిజెపితో సంప్రదింపులు!

పశ్చిమ బెంగాల్ లోని అధికార పక్షం తృణమూల్ కాంగ్రెస్ లో పలువురు ప్రజా ప్రతినిధులు అసంతృప్తితో బిజెపి వైపు చూస్తున్నారా? గత వారం జరిగిన రాష్ట్రపతి ఎన్నికలలో సహితం నలుగురు ఎంపీలు, పలువురు ఎమ్యెల్యేలు ఎన్డీయే అభ్యర్ధికి ఓట్ వేయడం తెలిసిందే. 38 మంది ఆ పార్టీ ఎమ్యెల్యేలో బిజెపితో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రముఖ బిజెపి నాయకుడు,  సినీ నటుడు మిథున్ చక్రవర్తి ప్రకటించడంతో ఆ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనాలు ప్రారంభం అయ్యాయి. 
 
 పైగా,ఈ 38 మందిలో 21 మంది ఎంఎల్‌ఏలు నేరుగా తనతోనే టచ్‌లో ఉన్నట్లు ఆయన వెల్లడించడం గమనార్హం. ఉపాధ్యాయుల ఎంపిక కుంభకోణంలో మంత్రి టీఎంసీ మంత్రి పార్థ చటర్జీ అరెస్టు తర్వాత ఆ పార్టీలో తుఫాన్‌ చెలరేగిందని, ఇదే బిగ్ బ్రేకింగ్ వార్త అంటూ ఆయన తెలిపారు. పార్థ చటర్జీ అరెస్టుపై మాట్లాడుతూ  ఆయన తప్పు చేయకపోతే ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని మిథున్ పేర్కొన్నారు. ఒకవేళ తప్పు చేస్తే మాత్రం ఎవరూ ఆయన్ను కాపాడలేరని స్పష్టం చేశారు. ఇది రూ.2000 కోట్ల భారీ కుంభకోణం అని ఆరోపించారు.
 
మహారాష్ట్రలో బిజెపి, శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లు ఒక రోజు ఉదయం ముంబైలో ఉండగా దినపత్రికల్లో చదివానని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలోని 18 రాష్ట్రాలలో బిజెపి అధికారంలో ఉందని, త్వరలోనే మరికొన్ని రాష్ట్రాలలో పార్టీ పతాకం ఎగురడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.  
పశ్చిమ బెంగాల్‌లో బిజెపి తన పోరాటం ఆపదని, రాష్ట్రంలో ఇప్పుడు స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిగితే తదుపరి ప్రభుత్వాన్ని బిజెపి ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే,  తప్పుడు వాదనలతో ప్రజలను మోసం చేయడానికి మిథున్ ప్రయత్నిస్తున్నారంటూ టిఎంసి ఎంపి శంతను సేన్ విమర్శించారు.
అలాగే బీజేపీ ముస్లిం వ్యతిరేక పార్టీనా? అనే అంశంపైనా ఆయన స్పందిస్తూ ప్రస్తుతం దేశంలో అతిపెద్ద సూపర్‌స్టార్లు అయిన సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, ఆమిర్‌ ఖాన్‌లు ముస్లింలే అని చెప్పారు. హిందువులు, ముస్లింలు, సిక్కులు ఆదరించడం వల్లే తను నటుడిగా ఈ స్థాయికి చేరుకున్నట్లు తెలిపారు. బీజేపీ 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని అక్కడ కూడా వాళ్ల సినిమాలకు భారీ కలెక్షన్లు వస్తున్నట్లు గుర్తు చేశారు. ఒకవేళ బీజేపీ వాళ్లను ద్వేషిస్తే ఇది సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు.