దక్షిణ కన్నడ జిల్లాలో యువమోర్చా నేత దారుణ హత్య

దక్షిణ కన్నడ జిల్లాలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా నేత ప్రవీణ్ నెట్టారు దారుణ హత్యకు గురయ్యాడు.  ప్రవీణ్‌ స్వస్థలం సుళ్య తాలుకా బెళ్లారపేటె కేరళ సరిహద్దుల్లో ఉంది. ప్రవీణ్‌ స్థానికంగా ఓ పౌల్ట్రీ షాప్‌ను నిర్వహిస్తోన్నారు.
 
మంగళవారం రాత్రి షాప్‌ను మూసివేసి, ఇంటికి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై దాడి చేశారు. ప్రవీణ్‌ను బైక్‌పై వెంటాడి  కత్తులతో దాడి చేసి అత్యంత కిరాతకంగా అతడిని  నరికి చంపారు. మారణాయుధాలు పట్టుకున్న ముగ్గురు వ్యక్తులు బైక్‌పై పుత్తూరు రోడ్డువైపు పారిపోతుండటం తాను చూశానని ఆయన దగ్గర పనిచేస్తున్న ఉద్యోగి మధుకుమార్ రయన్ పోలీసులు ఫిర్యాదు చేశారు. 
అనంతరం.. రక్తపు మడుగులో పడివున్న అతడిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.  వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రవీణ్‌ను పుత్తూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ ప్రవీణ్‌ మృతిచెందాడు.
ఈ విషయం కాస్తా.. బీజేపీ నేతలు, యువమోర్చా నాయకులకు తెలియడంతో వారు భారీ సంఖ్యతో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.
అర్ధరాత్రి రోడ్డుపై కూర్చోని నిరసనలు తెలిపారు. ఈ క్రమంలో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తకర వాతావరణం చోటుచేసుకుంది.  నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు దక్షిణ కన్నడ ఎస్పీ రిషీకేశ్ సోనవనె తెలిపారు.
ప్రవీణ్‌ హత్యపై కర్నాటక సీఎం బసవరాజ్ దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు.  ప్రవీణ్ కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు. నిందితులను త్వరగా పట్టుకుంటామని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. బీజేపీ కార్యకర్త దారుణ హత్యను ఖండిస్తూ హిందూ సంస్థలు బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో బుధవారంనాడు సులియా, కడబ, పుత్తూరు తాలూకాల్లో బంద్ పాటించారు. ప్రధాన వాణిజ్య సంస్థలు, స్కూళ్లు మూతపడ్డాయి.
 
ప్రజలు ఎలాంటి ఆందోళనకు దిగవద్దని, ప్రశాంతంగా ఉండాలని దక్షిణ కన్నడ జిల్లా మంత్రి సునీల్ కుమార్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. నిందితులను సాధ్యమైనంత త్వరగా అరెస్టు చేస్తామని, పోలీసులు అదే పనిపై ఉన్నారని చెప్పారు.  కాగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా సబ్ డివిజన్ పరిథిలో బుధవారం ఉదయం 6 గంటల నుంచి గురువారం అర్థరాత్రి వరకూ 144 సెక్షన్‌ను విధిస్తునట్టు పుత్తూరు అసిస్టెంట్ కమిషనర్ ఎస్ గిరీష్ నందన్ ప్రకటించారు.