తెలంగాణ బాగుపడాలంటే కేసీఆర్ ను ఓడగొట్టాల్సిందే 

తెలంగాణ బాగుపడాలంటే కేసీఆర్ ను ఓడగొట్టాల్సిందే అని బిజెపి ఎమ్యెల్యే, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. తనపై కొందరు టీఆర్‌ఎస్‌ అసందర్భ ఆరోపణలు చేయడం పట్ల మండిపడుతూ  తన ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేక కేసీఆర్ తన బానిసలతో తిట్టించి సంబర పడుతున్నారని ఎద్దేవా చేశారు.
 
గజ్వేల్‌లో పోటీ చేస్తా.. సిద్ధమా? అని తాను సవాలు విసిరితే దానిని స్వీకరించకుడా సీఎం కేసీఆర్‌ బానిసలతో అవమానకరంగా తిట్టిస్తున్నారని చెబుతూ  కేసీఆర్‌ను ఓడించకపోతే తన జీవితానికి సార్ధకతే లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు రాజేందర్ తేల్చి చెప్పారు. 
 
‘‘కేసీఆర్​కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలి. నేను వందకు వంద శాతం గజ్వేల్​ నుంచే పోటీ చేస్తా. కానీ, కేసీఆర్​ గజ్వేల్​ నుంచి పోటీ చేయకుండా ఎక్కడికైనా పారిపోతే అప్పుడు ఆలోచిస్తా” అని ఈటల ధ్వజమెత్తారు. చెన్నూరు ఎమ్మెల్యే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని, ఆయన తన జాతి కోసం మాత్రం ఎప్పుడూ మాట్లాడలేదని విమర్శించారు. 
 
‘‘నీచమైన సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం కేసీఆర్. తెలంగాణకు పట్టిన శని, అరిష్టం పోవాలంటే కేసీఆర్​ను ఓడించాలి. ఈ జన్మలో నేను కేసీఆర్​ను ఓడగొట్టకపోతే… నా జన్మకు సార్థకత లేదు. దమ్ము, ధైర్యం ఉంటే నాపై పోటీకి రండి. తేల్చుకుందాం”అంటూ ఈటల సవాల్ చేశారు. 
 
కేసీఆర్‌కు దమ్ముంటే హుజూరాబాద్‌ గడ్డ నుంచి తనపై పోటీ చేయాలని సవాల్‌ విసురుతూ  ఊసరవెల్లిలా రంగులు మార్చే వ్యక్తులకు తన గురించి మాట్లాడే అర్హత లేదని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన కేసీఆర్‌ రాజీనామా చేయాలని, ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్‌చేశారు. 
 
హైదరాబాద్ చుట్టుపక్క దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములను గుంజుకొని వాటిని ప్రభుత్వం అమ్ముకుంటూ రియల్ ఎస్టేట్ బ్రోకర్ లా వ్యవహరిస్తోందని ఈటల విమర్శించారు. తనపై విమర్శలు చేస్తున్న బానిసలకు దమ్ముంటే దళితులకు ఆ భూములు ఇప్పించాలని డిమాండ్​ చేశారు. 
 
ధనిక రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు, వృద్ధులకు పెన్షన్ లు ఇచ్చే పరిస్థితి లేదని చెబుతూ రిటైర్డ్ అయితే ఉద్యోగులకు డబ్బులిచ్చే దమ్ము లేకనే వారి వయస్సును 61 ఏండ్లకు పెంచారని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ దృష్టిలో బానిసలే లీడర్లని, ఆత్మాభిమానం ఉన్న వాళ్లు కాదని స్పష్టం చేశారు. ఆత్మగౌరవం ఉన్న మనిషిగా టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశానని గుర్తు చేశారు.
 
తనకు శత్రువులెవరూ లేరని, టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లోని మిత్రులు టచ్‌లో ఉన్నారని చెప్పారు. తాను ఎమ్మెల్యే అవుతానని టీఆర్‌ఎస్‌లో చేరలేదని, తన ఉద్యమ పటిమ చూసి 2004లో ఎమ్మెల్యేగా చాన్సిచ్చారని, ఇప్పటికీ ఓటమి ఎరగలేదని తెలిపారు. పార్టీలో నుంచి అందరు వెళ్లిపోతున్నా కేసీఆర్‌ మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.  
 
తాను పెట్టిన సభను చూసే.. 2004లో కేసీఆర్ టికెట్ ఇచ్చారని ఈటల గుర్తు చేశారు. టీఆర్ఎస్​లో 2004, 2008లో అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేను తానే అని చెప్పారు. కేసీఆర్ బొమ్మతో తాను ఎప్పుడూ గెలవలేదని, ప్రజల అభిమానంతోనే విజయం సాధించానని స్పష్టం చేశారు.
 
పదవుల కోసం తెలంగాణ ఉద్యమంలో చేరలేదని చెప్పారు. 2018 ఎన్నికల్లో తనను ఓడించాలని కేసీఆర్‌ కుట్ర పన్నారని ఈటల ఆరోపించారు. తనపై చేసిన విధంగానే ఇతర నేతలపైనా కేసీఆర్ ప్రయోగాలు చేశారని.. ఫలితంగా వారంతా ఓడిపోయారని.. తానొక్కడు మాత్రమే గెలిచానని పేర్కొన్నారు.
 
కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పోయిందని చెబుతూ బీఆర్ఎస్ పెట్టినా గట్టెక్కలేరని తేల్చి చెప్పారు. రాష్ట్రాన్ని పరిపాలించే ధైర్యం లేక వీఆర్వోలను తీసేశారని పేర్కొంటూ వాళ్ల ఉసురు కేసీఆర్ కు తప్పకుండా తగుల్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్, ఈటెల, హరీష్ రావు పాత్ర ఏంటో అందరికి తెలుసని గుర్తు చేశారు. 
 
తన ప్రతిష్టని ఓర్వలేక చల్లర ఆరోపణలు చేసి తనను బయటకి పంపించారని చెబుతూ  టీఆర్ఎస్​లో  కేసీఆర్ కంటే తనతోనే ఎక్కువ మందికి పరిచయాలు ఉన్నాయని స్పష్టం చేశారు. అనవసరంగా తనను రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు.