బెంగాల్ మంత్రి పార్థా ఛటర్జీ అవినీతి రట్టు చేసిన `నల్ల డైరీ’

ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్ట్ చేసిన పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థా ఛటర్జీ అవినీతికి సంబంధిచిన కీలక వివరాలకు సంబంధించిన ఓ `నల్ల డైరీ’ దర్యాప్తు అధికారులకు చిక్కింది. 
దాదాపు రూ 21 కోట్లతో  అడ్డంగా దొరికిపోయిన రాష్ట్ర మంత్రి పార్థా ఛటర్జీ  సహాయకురాలు, నటి, మోడల్ అర్పితా ముఖర్జీ ఇంట్లో నల్ల డైరీని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇది కీలకం కానుంది. ఈ డైరీలో ఎవరెవరి ద్వారా ఏఏ తేదీల్లో ఎంత మొత్తం తీసుకున్నారనే వివరాలున్నాయి.
అర్హత లేకున్నా ఎవరెవరికి ఉద్యోగాలిచ్చారో అందులో స్పష్టంగా ఉంది. దీంతో మంత్రి పార్థా ఛటర్జీతో పాటు కేసుకు సంబంధం ఉన్న వారి గుట్టు రట్టుకానుంది. టీఎంసీ మూలాలన్నీ బయటపడనున్నాయి. అర్పితా ముఖర్జీకి కూడా చిక్కులు పెరగనున్నాయి.  అటు పార్థా చటర్జీకి ఆగస్ట్ మూడు వరకూ ఈడీ కస్టడీ కొనసాగనుంది. ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రిగా ఉన్న పార్థా ఛటర్జీ గతంలో విద్యామంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఉపాధ్యాయ నియామకాల్లో అవినీతి జరిగింది.
మరోవైపు ఇదే కేసులో టీఎంసీ ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్యకు  తాజాగా ఈడీ సమన్లు జారీ చేసింది.  కాగా, రూ 21 కోట్ల  నగదుతో  అడ్డంగా దొరికిపోయిన రాష్ట్ర మంత్రి పార్థా ఛటర్జీపై ముఖ్యమంత్రి  మమతాబెనర్జీ ఇప్పటికే కన్నెర్ర చేశారు. పార్థా ఛటర్జీ దోషిగా తేలితే జీవితఖైదు విధించినా తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.
అందరూ ఒకేలా ఉండరన్న మమత, తానెప్పుడూ అవినీతిని సమర్థించబోనని చెప్పారు. ప్రభుత్వానికి కానీ, పార్టీకి కానీ అర్పితా ముఖర్జీతో ఎలాంటి సంబంధాలు లేవని మమత స్పష్టం చేశారు. తాను గతంలో దుర్గా పండాల్‌ను సందర్శించినప్పుడు ఒక మహిళను పార్థా చటర్జీ స్నేహితురాలని చెప్పి పరిచయం చేశారని మమత గుర్తు చేసుకున్నారు. తానేమీ దేవతను కాదని, ఎవరి స్నేహితులు ఎలాంటి వారో తనకెలా తెలుస్తుందని మమత ప్రశ్నించారు.