రూ 100 కోట్లకు రాజ్యసభ సీట్ … రాకెట్ చేధించిన సిబిఐ 

రాజ్యసభ సీట్లు, గవర్నర్ పదవుల పేరుతో మోసానికి పాల్పడిన ముగ్గురు నిందితుల నిర్వాకాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ బట్టబయలు చేసింది. దాదాపు రూ.100 కోట్ల మేర నిందితులు మోసాలకు పాల్పడినట్లు తేలింది .డబ్బులు చేతులు మారుతున్న సమయంలో నిందితుడ్ని సిబిఐ పట్టుకుంది. కొన్ని వారాలుగా గుర్తు తెలియని  ఓ ఫోన్‌ కాల్‌ ట్యాప్‌ చేసి సమాచారం తెలుసుకున్న సిబిఐ, నిందితులపై నిఘా పెట్టి.. పట్టుకుంది.
ఈ కేసులో నలుగురిపై సిబిఐ అభియోగాలు మోపింది. ఈ రాకెట్‌లో ప్రధాన సూత్రధారులైన కమలాకర్ బండ్గర్, రవీంద్ర విఠల్ నాయక్, మహేంద్రపాల్ అనే నిందితులను అరెస్ట్ చేశారు.  పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మహారాష్ట్ర, కర్నాటకలో నిందితులను పోలీసులు పట్టుకున్నారు.
ఈ రాకెట్‌కు పాల్పడిన వారిలో కమలాకర్ ప్రేమ్‌కుమార్ బండ్‌గర్ అనే వ్యక్తి మహారాష్ట్ర, రవీంద్ర విఠల్ నాయక్ కర్ణాటక, మహేంద్రపాల్ అరోరా, అభిషేక్ బోరా అనే వ్యక్తులిద్దరూ ఢిల్లీకి చెందిన వారిగా సీబీఐ తెలిపింది. వీరంతా చాలా కాలంగా ఈ రాకెట్ నడుపుతున్నారు.
రాజ్యసభ సీట్లు ఇప్పిస్తామని, ప్రభుత్వ సంస్థలకు చైర్‌పర్సన్ అయ్యే అవకాశం కల్పిస్తామని, మంత్రిత్వ శాఖల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాలు ఇప్పిస్తామని బాధితులను నిందితులు మోసం చేసినట్లు సీబీఐ తెలిపింది. సీనియర్ సీబీఐ అధికారిగా తనను తాను అందరికీ పరిచయం చేసుకుని బండ్‌గర్ ఈ మోసాలకు పాల్పడినట్లు తెలిసింది. 
 
అభిషేక్ బోరా తనకున్న పరిచయాలతో కమలాకర్ ప్రేమ్‌కుమార్ బండ్‌గర్‌తో కలిసి కుట్ర పన్ని ప్రభుత్వ శాఖల్లో ఉండే ఉన్నతాధికారులతో మాట్లాడేవాడని.. అలా ఈ ఇద్దరూ కలిసి కోట్లు చెల్లించే వారికి నమ్మకం కలిగించేవారని సమాచారం. ఈ మోసాలకు మహ్మద్ అజీజ్ ఖాన్ అనే వ్యక్తి సాయం కోరి,తమకు కోట్లు చెల్లించే ఆశావహులను పరిచయం చేస్తే.. ఆ వచ్చిన డబ్బులో వాటా ఇస్తామని బండ్‌గర్ అతనికి చెప్పాడని సీబీఐ విచారణలో తేలింది. 
 
దాదాపు రూ.100 కోట్లకు పైగా ముంచిన వ్యవహారం కావడంతో దేశవ్యాప్తంగా ఈ రాజ్యసభ సీట్ల రాకెట్ పెను దుమారం రేపింది. అన్ని కోట్లు చెల్లించిన ఆ ఆశావహులు ఎవరనే విషయం ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఆసక్తికరంగా మారింది.