శ్రీలంక అధ్యక్షభవనంలో విధులు ప్రారంభం

శ్రీలంక అధ్యక్ష సెక్రటేరియట్ నుంచి మళ్లీ విధులు ప్రారంభమయ్యాయి. జులై నెల ప్రారంభంలో అధ్యక్ష సెక్రటేరియట్ లోపలికి ఆందోళనకారులు చొచ్చుకుని వచ్చారు. ఆందోళ‌న‌కారులు అధ్య‌క్ష భ‌వ‌నాన్ని ముట్ట‌డించడానికి ముందు మాజీ అధ్య‌క్షుడు గొట‌బాయ రాజ‌ప‌క్స దేశం విడిచి వెళ్లారు. 
 
అయితే గ‌త శుక్ర‌వారం భారీ స్థాయిలో మిలిట‌రీ ఆ భ‌వ‌నాన్ని త‌మ ఆధీనంలోకి తీసుకున్న‌ది. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనకారులు సెక్రటేరియట్ లోని పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించారు. సెక్రటేరియట్ లోని పలు చోట్ల మరమ్మతులు కొనసాగుతున్నాయి.  కొత్త అధ్య‌క్షుడు రాణిల్ విక్ర‌మ‌సింఘేకు వ్య‌తిరేకంగా కూడా నిర‌స‌న‌కారులు ఆందోళ‌న చేస్తున్నారు. వారిని అదుపు చేసేందుకు అద‌న‌పు బ‌ల‌గాల్ని మోహ‌రించారు.
 
ఈ పరిస్థితుల దృష్ట్యా గట్టి భద్రత మధ్య కొత్త అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే తన విధులు ప్రారంభించారు. గత అధ్యక్షుడు  గొటబాయ రాజపక్స తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లాలంటూ గత మూడ్నెళ్లుగా లంకవాసులు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో ఈనెల 9న తీవ్ర విధ్వంసానికి దిగారు.
 
మరోవంక,   ప్రస్తుతం సింగపూర్‌లో తలదాచుకుంటున్న శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు అక్కడా ఊహించని షాక్‌ తగిలింది. యుద్ధనేరాల కింద ఆయన అరెస్టు చేయాలని దక్షిణాఫిక్రకు చెందిన మానవహక్కుల బృందం క్రిమినల్ కేసు నమోదు చేసింది. యుద్ధ నేరాల ఆరోపణలతో గొటబయను అరెస్ట్‌ చేయాలంటూ.. సింగపూర్‌ అటార్నీ జెనరల్‌కు 63 పేజీల ఫిర్యాదునుఇంటర్నేషనల్‌ ట్రూత్‌ అండ్‌ జస్టిస్‌ ప్రాజెక్ట్‌(ఐటీజేపీ) న్యాయవాదులు అందజేశారు.
2009లో జరిగిన అంతర్యుద్ధం సమయంలో రక్షణ మంత్రిగా ఉన్న రాజపక్సే జెనీవా ఒప్పందాలను తీవ్రంగా ఉల్లంఘించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అవి అంతర్జాతీయ న్యాయపరిధిలో భాగంగా సింగపూర్‌ దేశీయ ప్రాసిక్యూషన్‌కు లోబడిన నేరాలుగా పేర్కొన్నారు.  ఎల్ టి టి ఇకి వ్యతిరేకంగా శ్రీలంకలో దశాబ్దాల తరబడి సాగిన పౌర యుద్ధంలో గొటబాయ పాత్రను ప్రశ్నించారు.  శ్రీలంక ప్రజలు ఆయన్ను యుద్ధవీరుడు అని పొగిడినా  2009లో  ఎల్ టి టి ఇ   అధినేత ప్రభాకరన్ మృతితో యుద్ధం ముగించిన తీరు సరికాదని స్పష్టం చేసారు. 
 
గొటబయ రాజపక్సను అరెస్ట్‌ చేసి యుద్ధ నేరాలపై దర్యాప్తు చేపట్టాలని కోరింది ఐటీజేపీ. 1989లో ఆయన ఆర్మీ కమాండర్‌గా ఉన్నప్పుడు.. సుమారు 700 మంది కనిపించకుండా పోయారని ఆరోపించింది. ముఖ్యంగా రక్షణ శాఖ సెక్రెటెరీగా ఉన్నప్పుడు ఆ నేరాలు మరింత పెరిగాయని తెలిపింది. తన కింది అధికారులకు టెలిఫోన్‌ ద్వారా నేరుగా ఆదేశాలు ఇచ్చి ప్రజలపై దాడి చేయించే వారని ఆరోపించింది. గొటబాయను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.