50 ఏళ్ల తర్వాత మయన్మార్ లో నలుగురు రాజకీయ నేతలకు ఉరిశిక్ష

మయన్మార్ మిలటరీ ప్రభుత్వం నలుగురు ప్రజాస్వామ్య అనుకూల కార్యకర్తలకు ఉరిశిక్ష అమలు చేసింది. సోమవారం ఈ విషయాన్ని ప్రకటించి ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఆంగ్‌సూకీ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వాన్ని గతేడాది కూల్చేసి అధికారంలోకి వచ్చిన మిలటరీ ప్రభుత్వం 25 ఏళ్ల తర్వాత దేశంలో ఉరిశిక్ష అమలు చేసింది. 
 
ఉరిశిక్ష ఎదుర్కొన్న నలుగురిని సైన్యం గతేడాది అరెస్ట్ చేసింది. వారిపై ఉగ్రవాదం, జుంటాకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలకు ఆయుధాలివ్వడం వంటి అభియోగాలు మోపింది. ఈ ఏడాది జనవరిలో వీరికి ఉరిశిక్ష విధించింది. దీనిపై వారు అప్పీలు చేసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
ఉరిశిక్ష ఎదుర్కొన్న నలుగురిలో ఇద్దరు ముఖ్యమైన రాజకీయ నాయకులు కావడం గమనార్హం. రేపర్, హిప్ హాప్ ఆర్టిస్ట్ అయిన ఫియో జయర్ థా వీరిలో ఒకరు. నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ () సభ్యుడైనా ఫియో.. 2012 నుంచి పార్లమెంటు సభ్యుడు కూడా. పార్టీ నేత ఆంగ్‌సాన్ సూకీకి సన్నిహితుడు.
రెండో వ్యక్తి కో జిమ్మీ సీనియర్ ప్రజాస్వామ్య కార్యకర్త. మిలటరీ జుంటా నేతృత్వంలోని జనరల్ నె విన్ పాలనకు వ్యతిరేకంగా అప్పట్లో జరిగిన విద్యార్థుల ఆధ్వర్యంలోని ‘88 మూవ్‌మెంట్’లో సభ్యుడు కూడా. ఈ ఆందోళనల కారణంగా 1990లో జరిగిన ఎన్నికల్లో ఆంగ్‌సాన్ సూకీ విజయం సాధించింది.
అయితే, ఆ ఎన్నికలను జుంటా రద్దు చేసింది. ఫలితంగా మయన్మార్‌ సుదీర్ఘకాలంపాటు అణచివేతకు గురైంది. ఆంగ్‌సాన్ సూకీ సహా వందలాదిమంది జైలు పాలయ్యారు.  ఫయో, కో ఇద్దరూ గతేడాది నవంబరులో అరెస్టయ్యారు. వీరిద్దరూ జుంటా వ్యతిరేక నిరసనలకు నాయకులు.
జుంటాకు వ్యతిరేకంగా సామూహిక తిరుగుబాటు కోసం ప్రజల సమీకరణకు పిలుపునిచ్చారు. సైనిక పాలకులకు వ్యతిరేకంగా పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ పేరుతో సాయుధ ప్రతిఘటన కోసం వారు ఆయుధాలను సేకరించారని వారిపై అభియోగాలు నమోదయ్యాయి. కాగా, మరణశిక్షకు గురైన మిగతా ఇద్దరి వివరాలు తెలియరాలేదు. 2021 సైనిక తిరుగుబాటు తర్వాత వందమందికిపైగా ఖైదీలకు మరణశిక్ష విధించారు.
మయన్మార్‌లో ఉరిశిక్ష అమలు చేయడం 25 ఏళ్లలో ఇదే తొలిసారి. గత 10 సంవత్సరాలు తప్ప మయన్మార్‌ను సైన్యం దశాబ్దాలుగా ప్రత్యక్షంగా పాలించింది. ప్రత్యర్థులకు మరణశిక్ష విధించింది. చివరిసారిగా 1990వ దశకంలో శిక్ష అమలు చేసింది.  జూన్‌లో మయన్మార్ జుంటా ప్రభుత్వం కొంతమంది ఖైదీలను ఉరితీయబోతున్నట్లు ప్రకటించినప్పుడు,  జుంటా సన్నిహిత మిత్రుడు, కాంబోడియా  ప్రధాన మంత్రి హున్ సేన్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కౌన్సిల్ ఛైర్మన్ హోదాలో ఉన్న సైనిక పాలకుడు జనరల్ మిన్ ఆంగ్ హ్లియాంగ్‌కు లేఖ రాశారు.
మరణశిక్షలు అమలు చేయొద్దని అందులో అభ్యర్థించారు. మయన్మార్ శాంతి, జాతీయ సయోధ్యను సాధించడంలో సాయం చేయాలన్న తన కోరికను వెల్లడించారు. ఆగ్నేయాసియా దేశాలైన కంబోడియా, ఫిలిప్పీన్స్ మరణశిక్షను రద్దు చేశాయి.
అమెరికా సహా అనేక దేశాల్లో మరణశిక్ష అమలులో ఉందని జుంటా అధికార ప్రతినిధి జా మిన్ తున్ గుర్తు చేశారు. వారి కారణంగా భద్రతా దళాలు  మినహా కనీసం 50 మంది అమాయక పౌరులు మరణించారని జా మిన్ తున్ తెలిపారు. అవసరమైన సమయంలో అవసరమైన చర్యలు అవసరమని ఆయన పేర్కొన్నారు.