యుద్ధ ప్రాతిపదికన ఆర్థిక వ్యవస్థ సరిదిద్దుతా 

బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికైతే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుని ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతానని ఈ పదవికి పోటీ పడుతున్న భారత మూలాలు కలిగిన రిషి సునాక్‌ హామీ ఇచ్చారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సవాళ్ళను ఎదుర్కొంటున్న నేపథ్యంలో సాధారణ వ్యాపార ధోరణితో వ్యవహరిస్తే సరిపోదని ఆయన స్పష్టం చేశారు. 
 
ఇప్పటి వరకు పోటీలో అగ్రగామిగా ఉంటూ వస్తున్న ఆయన చివరి అంకంలో వెనుకబడుతున్నట్లు సంకేతాలు వెలువడడంతో కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యుల హృదయాలను గెలుచుకునేందుకు ఈ వారాంతం ఆయన ముమ్మరంగా ప్రచారం మొదలుపెట్టారు.
 
 ”ఈ వ్యవస్థ పనిచేయాల్సినంత చక్కగా పనిచేయడం లేదని భావిస్తున్నాను. ప్రభుత్వంలో ఉన్న కారణంగా ఈ విషయం నాకు స్పష్టంగా తెలుస్తోంది.” అని ఆయన ఒక వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సంక్లిష్టమైన సవాళ్ళు ఎదురైనపుడు సాధారణ ధోరణితో ముందుకు వెళితే వాటిని పరిష్కరించలేమని హెచ్చరించారు. 
ఈ సమస్యలు ఈ మధ్య తలెత్తినవే కావని, చాలాకాలంగా మూలాలు ఉన్నాయని చెబుతూ, ఇటువంటి సవాళ్ళను ఎదుర్కోవడానికి పైపై చర్యలు సరిపోవని 43-ఏళ్ళ మాజీ ఆర్ధిక మంత్రి స్పష్టం చేశారు. 
 
కనుక అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. ముందుగా ద్రవ్యోల్బణానిు ఎదుర్కొనడం జాతీయ అత్యవసరంగా వుందని సునాక్‌ తెలిపారు. ప్రజలు చెల్లించే డబ్బుకు మరింత మెరుగైన విలువ వుండేలా చూడాల్సిన అవసరం వుందని చెప్పారు. 

కుటుంబాలనేవి చాలా చాలా ప్రత్యేకమని రిషి వ్యాఖ్యానించారు. ప్రధానిగా తాను కుటుంబాలనే పూర్తిగా సమర్ధిస్తానని హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యుల ప్రేమ, మద్దతు, వారి త్యాగాలు లేకపోతే తానిక్కడ వుండేవాడిని కానని తెలిపారు. ”హిందూ విశ్వాసం అనేది నాకు బలాన్ని ఇస్తుంది. ప్రయోజనాన్ని ఇస్తుంది. నాలో అది భాగం.” అని ఆయన భరోసా  వ్యక్తం చేశారు.