బెంగాల్ మంత్రి పార్థా ఛ‌ట‌ర్జీ అరెస్ట్

ప‌శ్చిమ బెంగాల్ మంత్రి పార్థా ఛ‌ట‌ర్జీని అదుపులోకి ఈడీ అధికారులు తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌ టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ స్కామ్‌లో పార్థా ఛ‌ట‌ర్జీకి సంబంధం ఉందని ఆరోపణలు రావడంతో ఆయన్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.

కోల్‌కతాలోని నివాసంలో సుమారు 26 గంటలకు పైగా ఆయన్ని ప్రశ్నించిన ఈడీ చివరకు శనివారం ఉదయం అదుపులోకి తీసుకుంది. ఇదిలా ఉంటే, శుక్రవారం అంతా విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి పరేష్‌ అధికారే, ఎమ్మెల్యే మాణిక్‌ భట్టాచార్య  తదితరుల ఇళ్లలో ఈడీ దాడులు కొనసాగాయి.

అదే సమయంలో పార్థాతో దగ్గరి సంబంధాలున్న అర్పిత ముఖర్జీ ఇంట్లో సైతం తనిఖీలు చేపట్టి సుమారు రూ. 20 కోట్ల విలువైన నగదును స్వాధీనం చేసుకున్నారు. బెంగాల్‌ స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌ నియామకాలు, ప్రైమరీ ఎడ్యుకేషన్‌ బోర్డులో అవకతవకల నేరాలకు సంబంధించిన డబ్బుగా అనుమానిస్తున్నారు అధికారులు. బ్యాంక్‌ అధికారుల సాయంతో ఈ డబ్బును లెక్కించారు ఈడీ అధికారులు. మొత్తం 500, 2వేల నోట్ల కట్టలే ఉన్నాయి. ఇరవైకి పైగా మొబైల్‌ ఫోన్స్‌ స్వాధీనం చేసుకున్నారు.

శుక్రవారం  రాత్రంతా పార్ధా ఛ‌ట‌ర్జీని విచారించామ‌ని, అత‌న్ని ఈడీ ఆఫీసుకు తీసుకువ‌చ్చిన‌ట్లు ఓ అధికారి తెలిపారు. ప్ర‌స్తుతం పార్థా ఛ‌ట‌ర్జీ బెంగాల్ ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్నారు. గ‌తంలో ఆయ‌న విద్యాశాఖ మంత్రిగా చేశారు. ఆయ‌న విద్యాశాఖ మంంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఉపాధ్యాయ పోస్టుల భ‌ర్తీలో కుంభ‌కోణం జ‌రిగినట్లు ఆరోప‌ణ‌లు రావడంతో జూన్ 29న ఈడీ విచారణ చేపట్టింది. ఇప్పటికే  రెండు ఎఫ్ఐఆర్ లను దాఖలు చేసింది.

ఈ కుంభకోణంపై ఇడి కాకుండా, సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సిబిఐ) దర్యాప్తు చేస్తోంది. ఆ రాష్ట్రంలో ఎయిడెడ్‌ పాఠశాలలో గ్రూప్‌ – సి, డి కేటగిరి ఉపాధ్యాయుల నియామకంలో జరిగిన అవకతవకలపై సిబిఐ దర్యాప్తు చేస్తోంది ఈడీ దాడులను బీజేపీ చేపట్టిన కుట్రపూరిత చర్యగా టీఎంసీ ఆరోపించింది. అయితే దీనికి బీజేపీ గట్టి కౌంటరే ఇచ్చింది. అసలు సినిమా ముందు ముందు ఉందంటూ ప్రతిపక్ష నేత సువెందు అధికారి ట్విటర్‌లో ఓ పోస్ట్‌ చేశారు.