ఆగస్టు 7 నుంచి ‘ఆకాశ ఎయిర్’ విమానాలు

దేశవ్యాప్తంగా విమాన సేవలను అందించేందుకు మరో కొత్త సంస్థ ఆకాశ ఎయిర్‌ అందుబాటులోకి వచ్చింది.  స్టాక్ మార్కెట్ లో పేరుమోసిన మదుపరుడు రాకేశ్ ఝున్‌జున్‌వాలాకు చెందిన  ‘ఆకాశ ఎయిర్’  ఆగస్టు 7వ తేదీ నుంచి తమ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. తమ తొలి సర్వీసును ముంబయి-అహ్మదాబాద్‌ మధ్య నడపనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే టికెట్‌ బుకింగ్‌లను ప్రారంభించినట్లు తెలిపింది.

అత్యంత చవకగా విమానయానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే తలంపుతో బిగ్‌బుల్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా మరికొందరితో కలిసి ఈ ఆకాశ ఎయిర్‌ను ప్రారంభించారు. విమానయాన నియంత్రణా సంస్థ డీజీసీఏ నుంచి ఈ నెల 7న ఆకాశ ఎయిర్‌ ‘ఎయిర్‌ ఆపరేటర్‌ సర్టిఫికెట్‌’ అందుకుంది.

మొత్తం 72 మ్యాక్స్‌ విమానాల కోసం కంపెనీ గత ఏడాది నవంబరులో బోయింగ్‌తో కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది.  ఆగస్టు 2021లో డీజీసీఏ మాక్స్ విమానాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఆగస్టు 13 నుంచి బెంగళూరు-కొచ్చి మధ్య కూడా సేవలు ప్రారంభిస్తామని ఆకాశ ఎయిర్‌ తెలిపింది.

ఆగస్ట్ 7 నుంచి ముంబై-అహ్మదాబాద్ రూట్‌లో వారానికోసారి నడిచే 28 విమానాలతోపాటు,  ఆగస్టు 13 నుంచి బెంగళూరు-కొచ్చి రూట్‌లో 28 విమానాల టిక్కెట్ల విక్రయాన్ని ప్రారంభించినట్లు ఆకాశ ఎయిర్ తెలిపింది. రెండు బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలతో తమ వాణిజ్య కార్యకలాపాలకు కంపెనీ శ్రీకారం చుట్టనుంది.

ఇప్పటికే ఒక విమానం భారత్‌కు చేరుకుంది. మరొకటి ఈ నెలాఖరు వరకు కంపెనీ చేతికి అందనుంది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రవీణ్‌ అయ్యర్‌ మాట్లాడుతూ దశలవారీగా ఇతర నగరాలకు కూడా తమ కార్యకలాపాలను విస్తరిస్తామని తెలిపారు. ఈ ఏడాది ప్రతినెలా తమ కంపెనీకి రెండు కొత్త విమానాలు అందుతాయని తెలిపారు.