గత 5 ఏళ్లలో 347 మంది పారిశుద్ధ్య కార్మికులు మరణం

గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 347 మంది పారిశుద్ధ్య కార్మికులు  వేర్వేరు ఘటనల కారణంగా చనిపోయారు ఈ తరహా మరణాలు ఉత్తరప్రదేశ్‌ )లో ఎక్కువ నమోదయ్యాయని లోక్‌సభకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం  వెల్లడించింది.
బీజేపీ ఎంపీలు సుబ్రాత్ పథాక్, మనోజ్ తివారీ లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రి విరేంద్ర కుమార్   సమాధానమిచ్చారు. మురుగు కాలువలు, సెప్టిక్ ట్యాంకుల క్లీనింగ్ సమయాల్లో ప్రమాదాలు, విషవాయువులు లీకవ్వడం వంటి ఘటనల కారణంగా కార్మికులు మరణించారని, ఇలాంటి ఘటనల నియంత్రణపై కేంద్రం దృష్టిసారించిందని ఆయన చెప్పారు.
సంవత్సరాల వారీగా మరణాల వివరాలను కూడా కేంద్రం పేర్కొంది. గత ఐదేళ్ల కాలంలో అత్యధికంగా 2019లో 116 మంది చనిపోగా.. 2017లో 92 మంది మృత్యువాతపడ్డారు. ఇక రాష్ట్రాలవారీగా లెక్కలను పరిశీలిస్తే.. గత ఐదేళ్లలో ఉత్తరప్రదేశ్‌లో అధికంగా 51 మంది చనిపోయారు. ఆ తర్వాత తమిళనాడులో 48 మంది, ఢిల్లీలో 44 మంది కన్నుమూశారు.
2019లో ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువగా ఉన్నాయి. ఇందులో సెప్టెక్ ట్యాంకు ఘటనల్లో 26 మంది ప్రాణాలు వదిలారు. ఇక 2022 విషయానికి వస్తే ఇప్పటివరకు 17 మంది కార్మికులు చనిపోయారు. అధికంగా తమిళనాడు(5), ఆ తర్వాత ఉత్తరప్రదేశ్(4) ఉన్నాయి.
 
ఈ తరహా ఘటనలు నివారించేందుకు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్‌ ల్యాబోరేటరీని ఏర్పాటు చేశామని మంత్రి వివరించారు. డ్రైయినేజీ వ్యవస్థ క్లీనింగ్‌కి సమగ్ర పరిష్కారాన్ని సిద్ధం చేసిందని, స్థానిక సంస్థలు వీటిని ఉపయోగించవచ్చునని ఆయన సూచించారు. 
 
వీటితోపాటు ప్రత్యక్షంగా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల కోసం పలు స్కీమ్‌లను ప్రవేశపెట్టామని చెప్పారు. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ మెకానైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్, స్వచ్ఛతా ఉద్యమీ యోజన, పారిశుద్ధ్య కార్మికుల కోసం స్వయం ఉపాధి స్కీమ్‌ పేర్లను ఆయన ప్రస్తావించారు.