చైనా యుద్ధ విమానాలు వస్తే సరిహద్దుల్లో గట్టిగా బదులిస్తాం

చైనా యుద్ధ విమానాలను సరిహద్దు లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ)కి దగ్గరగా గుర్తించిన వెంటనే తాము చాలా వేగంగా ఫైటర్ విమానాలతోపాటు అన్ని వ్యవస్థలను అత్యంత అప్రమత్తం చేస్తామని భారత వాయుసేన (ఐఏఎఫ్) చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి తెలిపారు. 
 
జూన్ చివరి వారంలో చైనా యుద్ధ విమానం ఎల్‌ఏసీ ప్రాంతంలో కొన్ని నిమిషాల పాటు తిరిగింది. దీంతో భారత రాడార్‌లు గుర్తించి అలెర్ట్ చేశాయి. వెంటనే భారత ఫైటర్ జెట్స్ రంగంలోకి దిగడంతో చైనా యుద్ద విమానం తోక ముడిచింది.
 
 తూర్పు లడఖ్ సరిహద్దులో నెలకొన్న ఘర్షణ వాతావరణాన్ని నివారించేందుకు భారత్, చైనా మధ్య 16 వ విడత ఉన్నత స్థాయి సైనిక చర్చలు ఆదివారంజరుగుతున్న సమయంలోనే  నేపథ్యంలో ఐఏఎఫ్ చీఫ్ వీఆర్ చౌదరి ఓ వార్తా సంస్థతో సరిహద్దులో చైనా ఘర్షణ వైఖరిని ప్రస్తావించడం గమనార్హం.
 
 ఎల్‌ఏసీ గగన తలంలో ఐఏఎఫ్ నిఘా ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. చైనీస్ ఎయిర్ క్రాఫ్ట్ ఏల్‌ఏసీకి కొంచెం దగ్గరగా వస్తున్నట్టుగా గుర్తించినప్పుడల్లా తగన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.  ఫైటర్ విమానాలను రంగం లోకి దించడంతోపాటు అన్ని వ్యవస్థలను హై అలర్ట్‌లో ఉంచుతామని చెప్పారు. 
 
ఇలా చైనా విమానాలను అడ్డుకుంటాంమని చెబుతూ, అయితే చైనా ప్రతిసారీ ఇలాంటి కవ్వింపులకు ఎందుకు దిగుతుందో అన్నదానికి సరైన కారణం కనిపించడం లేదని పేర్కొన్నారు. 
అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ
కాగా, రక్షణ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకం గురించి ఎయిర్ చీఫ్ మార్షల్ చౌదరి మాట్లాడుతూ, అగ్నిపథ్ పథకంలో చేరేందుకు 7.5 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. రక్షణ దళాల్లో చేరడానికి యువత ఎంత ఉత్సాహంగా ఉన్నారో దీనినిబట్టి అర్థమవుతోందని పేర్కొన్నారు.
ఎంపికైనవారికి డిసెంబరు నుంచి శిక్షణను ప్రారంభించవలసి ఉందని చెప్పారు.  ఇదంతా సకాలంలో జరగడానికి వీలుగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేయడం పెద్ద సవాల్ అని తెలిపారు.  ఈ ఏడాది వాయు సేన దినోత్సవ కవాతును చండీగఢ్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రధాన కార్యక్రమాలను ఢిల్లీకి బయట వేరొక ప్రాంతంలో నిర్వహించాలనేది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కల అని చెప్పారు. ఐఏఎఫ్ సామర్థ్యాలను దేశ యువతకు చూపించాలనేది తమ ఆలోచన అని తెలిపారు. అందుకే ఈ విన్యాసాలను ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క చోట నిర్వహిస్తున్నామని వివరించారు.
చండీగఢ్‌లో జరిగే విన్యాసాల్లో రఫేల్, ఎస్‌యూ-30, మిరేజ్ 2000 వంటి యుద్ధ విమానాలు పాల్గొంటాయి. సుప్రసిద్ధ సుఖ్నా సరస్సుపైన ఈ విన్యాసాలు జరుగుతాయి. చండీగఢ్‌తోపాటు దాని పరిసరాల్లోని పట్టణాల ప్రజలు కూడా వీటిని వీక్షిస్తారని అంచనా.