ఘోర ప్రమాదంలో 15 మంది అమర్‌నాథ్‌ యాత్రికులు మృతి

అమర్‌నాథ్‌ యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు జమ్ముకశ్మీర్‌లోని కాజిగుండ్‌ ప్రాంతంలో గురువారం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ  సంఘటనలో 15 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 45 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. 
 
జమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారిపై కాజీగుండ్‌లోని బద్రాగుండ్‌ క్రాసింగ్‌ వద్ద టిప్పర్‌ డంపర్‌ ఢీకోట్టినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను స్థానికు ఆసుపత్రులకు తరలించినట్లు వెల్లడించారు.  బల్టాల్ బేస్ క్యాంపునకు వెళుతున్న బస్సు అదుపుతప్పి ఖాజీగుండ్‌లోని నుసూ బడేర్‌గుండ్ సమీపంలో జాతీయ రహదారిపై ఒక టిప్పర్ డంపర్‌ను ఢీకొందని అధికారులు తెలిపారు.
 
కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అమర్‌నాథ్‌ యాత్రకు అంతరాయం ఏర్పడింది. జూలై 8న 16 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గల్లంతు కావడంతో  యాత్రను నిలిపివేశారు.
 వర్షాలు తగ్గిన క్రమంలో యాత్రను పునరుద్ధరించారు అధికారులు. తిరిగి ప్రారంభమైన మూడో రోజే ఈ ఘోర ప్రమాదం సంభవించింది. 
 
కాగా, కొనసాగుతున్న అమర్‌నాథ్ యాత్రలో గడచిన 36 గంటల్లో 8 మంది యాత్రికులు సహజ కారణాల వల్ల మరణించారు. దీంతో ఈ ఏడాది అమరనాథ్ యాత్రలో యాత్రికుల మరణాల సంఖ్య 41కి చేరుకుందని అధికారులు తెలిపారు.
 
అమరనాథ్‌ యాత్రకు భగవతి నగర్‌ బేస్‌ క్యాంప్‌ నుంచి గురువారం 5వేల మంది యాత్రికులు బయలుదేరినట్లు అధికారులు తెలిపారు. ‘నున్వాన్‌-పహల్గామ్‌, బాల్టాల్‌ బేస్‌ క్యాంపుల నుంచి 201 వాహనాల్లో మొత్తం 5,449 మంది యాత్రికులు బయలుదేరారు. ’ అని వెల్లడించారు. ఈ క్రమంలోనే ఓ బస్సు ప్రమాదానికి గురైందని తెలిపారు. 
 
ఇలా ఉండగా, కశ్మీరులో కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని అమర్‌నాథ్ యాత్రను రెండు మార్గాలలో నిలిపివేసినట్లు అధికారులు గురువారం ప్రకటించారు. అననుకూల వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని పహల్‌గామ్‌తోపాటు బల్టామ్ మార్గాల ద్వారా సాగే అమర్‌నాథ్ యాత్రను గురువారం ఉదయం నుంచి తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు చెప్పారు.
  ఇప్పటివరకు 1,44,457 మంది యాత్రికులు దర్శనం చేసుకున్నట్టుగా అధికారులు వెల్లడించారు. యాత్రికుల కోసం రెండు మార్గాల్లో హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉన్నాయి.  రక్షా బంధన్ సందర్భంగా ఆగస్టు 11న యాత్ర ముగియనుంది. వాతావరణం మెరుగుపడిన తర్వాత అమర్‌నాథ్ గుహలో వెలసిన మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు భక్తులను యాత్రకు అనుమతిస్తామని వారు చెప్పారు.