బుల్డోజర్ కూల్చివేతలపై నిషేధం విధించలేమని, అది పూర్తిగా మున్సిపల్ అధికారుల పరిధిలోని అంశమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎవరైనా చట్టానికి లోబడి నడుచుకోవాల్సిందేనని పేర్కొంది. దేశవ్యాప్తంగా బుల్డోజర్ కూల్చివేతలపై నిషేధం విధించాలని, ముస్లిం వర్గాలే లక్ష్యంగా కూల్చివేతలు సాగుతున్నాయంటూ ముస్లిం సంస్థ జమియత్ ఉలమా-ఐ- హింద్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ మేరకు యుపి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కూల్చివేతలు సర్వసాధారణంగా జరిగే వ్యవహారమని, ఉద్దేశపూర్వక చర్యలు కావని యుపి ప్రభుత్వం తెలిపింది
రాష్ట్రంలో అక్రమ నిర్మాణాలను చట్టబద్ధంగానే కూల్చివేస్తున్నట్టు స్పష్టం చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిల్స్ కోర్టులను తప్పుదోవ పట్టించడమేనని పేర్కొంది. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వారు, దాన్ని కాపాడుకునేందుకు ప్రాక్సీ లిటిగేషన్ మార్గాన్ని ఎంపిక చేసుకున్నట్టు యూపీ సర్కారు కోర్టు దృష్టికి తీసుకు వచ్చింది.
కాగా, సహరాన్ పూర్ లో నిర్మాణాల కూల్చివేత చట్టబద్ధమేనని యూపీ సర్కారు అఫిడవిట్ లో పేర్కొంది. ప్రయాగ్ రాజ్ కూల్చివేత కేసు అలహాబాద్ హైకోర్టు ముందు విచారణలో ఉందని తెలియజేస్తూ, దీనిపై సుప్రీంకోర్టు విచారణ అవసరం లేదని పేర్కొంది.
ఇటీవల వివాదాస్పదమైన కూల్చివేతలపై మధ్యప్రదేశ్, గుజరాత్ ప్రభుత్వాలకు సైతం సుప్రీం కోర్టు సమాధానం ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని కూల్చివేతలు చేపడుతున్నారని, అల్లర్లకు సాకుగా చేసుకుంటున్నారని పిటిషనర్ల తరపున న్యాయవాదులు దుష్యంత్ దేవ్, సియు సింగ్‌లు వాదించారు.
మునిసిపల్ అధికారులు నివాసాల కూల్చివేతను అవకాశంగా మార్చుకోవడం సరికాదని పేర్కొన్నారు. ప్రతి మత ఘర్షణ అనంతరం కూల్చివేతలు జరుగుతున్నాయని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, సమాజపరంగా మంచిది కాదని వాదించారు.
సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ అడ్వొకేట్ హరీష్ సాల్వేలు ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. అంతా భారతీయులేనని, అల్లర్లకు, కూల్చివేతలకు ఎలాంటి సంబంధం లేదని, అనవసరంగా సంచలనం చేయాలని చూస్తున్నారంటూ పిటిషనర్ల వాదనను తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో పిటిషనర్ల వాదనను తోసిపుచ్చిన సుప్రీం కోర్టు.. కూల్చివేతలపై నిషేధం విధించలేమని స్పష్టం చేసింది.
More Stories
భారత్ లో ఇంటర్నెట్ వినియోగదారులు 90 కోట్లు
బస్తర్ ప్రాంతంలో 12 మంది నక్సల్స్ హతం!
ఓఎంఆర్ పద్ధతిలో నీట్ యూజీ 2025 పరీక్ష