ప్రతి ఇంటా ఎగరాలి మువ్వన్నెల జెండా.. ‘హర్ ఘర్ తిరంగా’

దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా మరో భారీ ప్రచార కార్యక్రమానికి కేంద్ర సాంస్కృతిక శాఖ తెరలేపింది. దేశంలోని ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా రెపరెపలాడాలన్న ఉద్దేశంతో ‘హర్ ఘర్ తిరంగా’ పేరుతో భారీ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది.
 
 దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి తగినంత గుర్తింపునకు నోచుకోలేకపోయిన అనేకమంది స్వాతంత్ర్య సమరయోధుల చరిత్రను దేశ ప్రజలందరికీ తెలియ జేయడం ప్రధాన లక్ష్యంగా 75 వారాల పాటు వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.  66 వారాలుగా 47 వేలకు పైగా కార్యక్రమాలను నిర్వహించి, ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం నిర్వహించిన కార్యక్రమాల్లో ఒకటిగా మారిందని కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారులు తెలిపారు. 
 
సగటున ప్రతి గంటకు 4 కార్యక్రమాలు జరుగుతున్నాయని వెల్లడించారు. డిజిటల్ డిస్ట్రిక్ట్ రిపాజిటరీ (డీడీఆర్)లను ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల చరిత్రను డిజిటలైజ్ చేసినట్టు తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ తరం యువతలో దేశభక్తిని పెంపొందించడం కోసం వారిని భాగస్వామ్యులను చేస్తూ ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని చేపట్టినట్టు కేంద్ర సాంస్కృతిక శాఖ తెలియజేసింది.
ఈ క్రమంలో స్వాతంత్ర్య దినోత్సవం నాడు జాతీయ జెండాను ఎగుర వేయాలనుకునే ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా, 2002 ప్రకారం జాతీయ జెండాను అగౌరవపర్చకుండా నిర్దేశించిన నిష్పత్తి (3:2)లో తయారు చేసిన జెండాను ఎవరైనా సరే తమ ఇంటి వద్ద ఎగుర వేయవచ్చు.
జాతీయ జెండాలను ప్రజలందరికీ అందుబాటులో ఉంచేందుకు స్వయం సహాయక బృందాలను భాగస్వాములను చేస్తూ భారీగా జాతీయ జెండాలను రూపొందిస్తున్నట్టు కేంద్ర సాంస్కృతిక శాఖ తెలియజేసింది. ఈ-కామర్స్ పోర్టల్స్ సహా విస్తృతంగా జాతీయ జెండాలను అందుబాటులో ఉంచుతామని, జెండాను రూ. 25 కు నామమాత్రపు ధరతో ప్రజల భాగస్వామ్యం కూడా ఉండేలా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నామని వెల్లడించారు.
అలాగే జాతీయ జెండా రూపకర్తైన పింగళి వెంకయ్యను స్మరించుకుంటూ ఆగస్టు 2న ఆయన జన్మదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యే అవకాశం ఉంది. పింగళి వెంకయ్య జన్మస్థలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు పలు ఇతర ప్రత్యామ్నాయ ప్రాంతాలను వేదికగా పరిశీలిస్తున్నట్టు తెలిసింది.