తెలంగాణాలో కరోనా కాదు,  టైఫాయిడ్ .. పానీ పూరీ జాగ్రత్త!

తెలంగాణ ప్రజలను ఇప్పుడు టైఫాయిడ్ మహమ్మారి వణికిస్తోంది. ఈ జులై 12 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 2,752 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. ఇంకా చాలామంది ఆస్పత్రులకు రాకుండా సొంత వైద్యం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీనికంతటికీ పరిశుభ్రత లేని ఆహారం, రోడ్డు సైడ్ ఫుడ్ తినడమే అంటున్నారు వైద్య, ఆరోగ్య నిపుణులు.

అయితే.. పరిశుభ్రత పాటించని, రోడ్డుపక్కన వ్యాపారులు విక్రయించే పానీపూరి తినడం వల్లనే ఎక్కువ మంది అస్వస్థతకు గురవుతున్నారని తెలంగాణ ప్రజారోగ్య శాఖ (డీహెచ్) డైరెక్టర్ జి. శ్రీనివాసరావు తెలిపారు. అందువల్లే రాష్ట్రంలో టైఫాయిడ్ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు.

ఈ ఒక్క జులై నెలలోనే రాష్ట్రంలో 2,752 టైఫాయిడ్‌ కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు.  బాగా మరిగించిన నీటితోనే పానీ పూరీ తయారు చేయాలని విక్రయదారులను ఆయన కోరారు. ప్రస్తుతం భారీ వర్షాలతో వరదలు, కొట్టుకొస్తున్న చెత్తా, చెదారంతో రోడ్డు సైడ్ పరిసరాలు శుభ్రంగా ఉండవు.

ఈగలు, దోమల బెడద కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకని ఈగలు, దోమలు వాలకుండా రోడ్సైడ్ ఫుడ్ అమ్మేవాళ్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  పానీ పూరీ తింటే కేవలం పది రూపాయలు అవుతుందని, దానివల్ల వచ్చే జబ్బుతో ఆస్పత్రి పాలు కావడం వల్ల అటు ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, దాదాపు రూ 10 వేలకు పైగా డబ్బులు ఖర్చుపెట్టుకోవాల్సి వస్తుందని డీహెచ్ హెచ్చరించారు.

అందుకని పది రూపాయల పానీ పూరి కోసం హెల్త్ పాడుచేసుకోవద్దని సూచించారు. ఇక ప్రైవేటు  ఆస్పత్రులు అనవసరమైన ల్యాబ్ పరీక్షలను రాస్తే  పట్టించుకోవద్దని, అట్లాంటి వారి నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలని కోరారు. టైఫాయిడ్, కలరా, మలేరియా వంటి సీజనల్ సంబంధిత వ్యాధులతో ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా చూసుకోవాలని సూచించారు.

కరోనా కథ ముగిసినట్లే

కాగా, నుంచి బయటపడ్డామని,  ఇప్పుడు సీజనల్ వ్యాధులతో పోరాడాలని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. కొత్త వేరియంట్ వస్తే తప్ప కరోనా కథ ముగిసినట్లేనని చెప్పారు. గత ఆరు వారాలుగా కరోనా కేసుల సంఖ్య పెరిగిందని, అయితే కరోనా గురించి భయపడాల్సిన పనిలేదని డీహెచ్ పేర్కొన్నారు. ఇది ఎండమిక్ దశకు చేరుకుందని పేర్కొన్నారు. 

సాధారణ జలుబు, జ్వరం లక్షణాలు ఉంటాయని వివరించారు. కరోనా కూడా ఓ సీజనల్ వ్యాధిగా మారిపోయిందని వ్యాఖ్యనించారు. లక్షణాలుంటే కేవలం 5 రోజులే క్వారంటైన్‌లో ఉండాలని తెలిపారు. కరోనా లక్షణాలు లేని వారికి నిర్ధారణ పరీక్షలు అవసరం లేదని స్పష్టం చేశారు. 

బ్యాక్టీరియా, వైరస్‌తో సీజనల్ వ్యాధులు వస్తాయని, వర్షాలు పడే సమయంలో అత్యంత అవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని డీహెచ్ సూచించారు. కరోనాకు ముందు 2019లో వేల ల్లో డెంగీ కేసులు వచ్చాయని, అప్పుడు కొన్ని మరణాలు కూడా నమోదయ్యాయని తెలిపారు. 

ప్రైవే ట్ ఆస్పత్రులు అవసరం లేకుండా ప్లేట్‌లెట్ మార్పి డి చేయొద్దని చెప్పారు. ప్రజల బలహీనతను వ్యాపారంగా మార్చుకోవద్దని, అత్యవసరం అయితేనే ప్లేట్‌లెట్ చికిత్స అందించాలని స్పష్టం చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 1,184 డెంగీ కేసులు నమోదయ్యాయని తెలిపారు.