భారత్ కీలక సమాచారాన్ని ఐఎస్ఐకు అందించిన పాక్ జర్నలిస్ట్ 

పాకిస్థాన్‌కు చెందిన సీనియర్‌ జర్నలిస్టు నస్రత్‌ మీర్జా సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్‌ యూట్యూబర్‌ షకీల్‌ చౌధరికి ఇచ్చిన ఇంటర్వ్యూలో విస్తుగొలిపే విషయాలు వెల్లడించారు. తాను 2005 నుంచి 2011 మధ్య కాలంలో (యుపిఎ హయాంలో) భారత్‌లో అనేకసార్లు పర్యటించినట్లు మీర్జా చెప్పారు. 

2010లో నాటి ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ ఆహ్వానం మేరకు ఢిల్లీలో ఉగ్రవాదంపై నిర్వహించిన సదస్సుకు హాజరైనట్లు తెలిపారు. చివరిసారిగా 2011లో భారత్‌లో పర్యటించానని చెప్పారు. తాను భారత్ లో పర్యటించిన సమయంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తనకు అనేక సదుపాయాలు కల్పించేడిదని కూడా తెలిపారు. 

 భారత్‌ గురించి సేకరించిన రహస్య సమాచారాన్నంతటినీ పాక్‌ నిఘా సంస్థ ఐఎస్ఐకు  అందజేసినట్లు మీర్జా వెల్లడించారు.  భారత్ కు వీసా ఇచ్చేటప్పుడు సాధారణంగా కేవలం మూడు ప్రదేశాలు (పట్టణాలు) సందర్శనకు మాత్రమే అనుమతి ఇచ్చేవారని, అయితే అప్పటి పాక్ విదేశాంగమంత్రి ఖుర్షిద్ కసూరి తనకు ఏడు ప్రదేశాలు పర్యటించే వీలు కల్పించారని వివరించారు. 

భారత్ లో ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, పాట్నా, కలకత్తాలలో పర్యటించినట్లు చెప్పారు. అయితే, భారత్‌ గురించి తాను విస్తృతంగా సేకరించిన రహస్య సమాచారాన్ని పాకిస్థాన్‌ సైన్యం వాడుకోలేకపోయిందని పేర్కొన్నారు. భారత నాయకుల బలహీనతల గురించిన విస్తృతమైన సమాచారం తమ వద్ద ఉన్నప్పటికీ పాక్ సైన్యం సక్రమంగా ఉపయోగించుకోలేక పోతున్నట్లు విచారం వ్యక్తం చేశారు.

భారత్‌లోని 40 రాష్ట్రాల్లో వేర్పాటువాద ఉద్యమాలు జరుగుతున్నాయని మీర్జా చెప్పగా.. యూట్యూబర్‌ చౌధరి కల్పించుకొని భారత్‌లో 29 రాష్ట్రాలే ఉన్నాయని గుర్తుచేశారు. దానికి ఆగ్రహం వ్యక్తం చేసిన మీర్జా తనకు అంతా తెలుసని వ్యాఖ్యానించడం గమనార్హం. భారత్‌, పాక్‌లు శాంతియుతంగా కలిసిమెలిసి ఉండొచ్చు కదా? అన్న ప్రశ్నకు  భారత్‌ శాంతికి వ్యతిరేకమని మీర్జా ఆరోపించారు.

ఆ సమయంలో భారత దేశ పార్లమెంట్ లో లోక్ సభ, రాజ్యసభలలో కలిపి 56 మంది ముస్లింలు సభ్యులుగా ఉన్నారని, వారందరూ తనకు తెలుసని చెప్పారు. భారత్ లోని ఉర్దూ  పత్రికల సంపాదకులతో పాటు అన్ని టివి న్యూస్ ఛానల్స్ లలో కీలకమైన వ్యక్తులు తనకు తెలుసని, తాను అనేక ఇంటర్వ్యూలు ఇచ్చానని వివరించారు.