21న విచారణకు రావాలని సోనియాకు ఈడీ సమన్లు 

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌)మరోసారి సమన్లు పంపించింది. ఈ సందర్భంగా జూలై 21న విచారణకు హాజరుకావాల్సిందిగా ఆ నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు.

నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి సోనియాను ఈడీ గత నెలలోనే జూన్ 1న విచారించాల్సి ఉండగా సోనియా కరోనా వైరస్‌ బారినపడటంతో విచారణ వాయిదా పడింది. అనారోగ్యం కారణంగా ఆమె విచారణకు హాజరు కాలేదు.

సమన్ల వాయిదా కోరుతూ గత జూన్‌లో సోనియాగాంధీ చేసిన లిఖిత పూర్వక విజ్ఞప్తిని ఈడీ అంగీకరించింది. కరోనా  నుంచి, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ నుంచి పూర్తిగా కోలుకునేంత వరకూ కొద్ది వారాల పాటు తన హాజరును వాయిదా వేయాలని సోనియాగాంధీ కోరారు. ఆ అభ్యర్థనకు స్పందించిన ఈడీ.. విచారణను వాయిదా వేసింది. 

విచారణ ముందుకు హాజరుకావాలని సోనియాగాంధీకి ఈడీ ఇచ్చిన నాలుగు వారాల గడువు ఈనెల 22తో ముగియనుంది.ఈ క్రమంలో సోమవారం మళ్లీ సమన్లు పంపింది. జూలై 21న విచారణకు హాజరు కావాలని అధికారులు తెలిపారు. ఇక, ఈ కేసు విచారణలో భాగంగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని సైతం ఈడీ ఇప్పటికే ఐదు రోజులపాటు విచారణ జరిపింది.