అమర్‌నాథ్ యాత్ర తిరిగి ప్రారంభం

పవిత్ర గుహ సమీపంలో కుంభవృష్టి అనంతరం వరదలు వెల్లువెత్తడంతో 16 మంది మృతి చెందిన ఘటనతో పాక్షికంగా నిలిపివేసిన అమర్‌నాథ్ యాత్ర సోమవారం ఉదయం తిరిగి ప్రారంభమైంది. కుంభవృష్టి కారణంగా దక్షిణ కశ్మీర్‌లోని అమర్‌నాథ్‌  గుహ సమీపంలో వరదలు సంభవించిన మూడు రోజుల తర్వాత యాత్ర ఆరంభమైంది.
 
‘‘మేం బాబా దర్శనం లేకుండా తిరిగి వెళ్లలేం. మాకు భోలే బాబాపై పూర్తి విశ్వాసం ఉంది,బాబా దర్శనం కోసం ఎదురు చూస్తున్నాం. యాత్ర తిరిగి ప్రారంభమైనందుకు మేం సంతోషిస్తున్నాము. సీఆర్‌పీఎఫ్ ఇతర సిబ్బంది మార్గనిర్దేశం చేశారు. క్షేమంగా ముందుకు సాగుతున్నాం’’ అని అమరనాథ్ యాత్రికులు చెప్పారు. 
 
బాల్తాల్ బేస్ క్యాంపు వద్ద యాత్రికులు యాత్రను పునర్ ప్రారంభించారు.శుక్రవారం అమర్‌నాథ్ గుహ పుణ్యక్షేత్రం సమీపంలో వరదలు సంభవించిన కారణంగా 16 మంది మరణించారు.మరో 36 మంది మంది తప్పిపోయారు. భారత వాయుసేన, చీటల్ హెలికాప్టర్ల ద్వారా గాయపడిన మరో 34 మంది యాత్రికులను ఆసుపత్రికి తరలించారు.
 
జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌జి) మనోజ్ సిన్హా ఆదివారం పహల్గామ్‌లోని బేస్ క్యాంపును సందర్శించి యాత్రికులను కలిశారు. వరదలతో దెబ్బతిన్న రోడ్డు మార్గానికి మరమ్మతులు చేశారు. జమ్మూ వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ కార్యకలాపాలను వేగవంతం చేయడానికి తాము రెస్క్యూ పరికరాలను ఉపయోగిస్తున్నామని భారత సైన్యం తెలియజేసింది.
 
కాగా,   తీవ్ర అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా జమ్మూ నుంచి కశ్మీర్‌లోని బేస్‌ క్యాంప్‌లకు చేరుకోవాల్సిన అమర్‌నాథ్‌ యాత్రికుల కొత్త బ్యాచ్‌లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.జూన్‌ 30వ తేదీ నుంచి మొదలైన 43 రోజుల అమర్‌నాథ్‌ యాత్ర ఆగస్ట్‌ 11వ తేదీన రక్షా బంధన్‌ రోజున ముగియనుంది.
 
కరోనా విజృంభణ తరువాత రెండేళ్ల పాటు అమర్‌నాథ్‌ యాత్రను ప్రభుత్వం నిలిపేసింది. ఈ ఏడాది మళ్లీ యాత్రకు భక్తులను అనుమతించింది. ఎత్తైన ప్రదేశం కారణంగా ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉన్న ప్రయాణీకులకు తగిన ఏర్పాట్లు చేసింది.