మంకీపాక్స్ భారత్ లో అడుగు పెట్టిందా!

ఆఫ్రికా, ఐరోపా దేశాలలో కలకలం సృష్టిస్తున్న మంకీఫాక్స్  వైరస్ మన దేశంలోనూ అడుగుపెట్టినట్టు అనుమానిస్తున్నారు. కోల్‌కతాకు చెందిన ఓ విద్యార్థి మంకీపాక్స్ వంటి లక్షణాలతో ఆసుపత్రిలో చేరడం ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమ మిడ్నాపూర్‌కు చెందిన ఆ విద్యార్థి ఇటీవల ఐరోపా నుంచి తిరిగి వచ్చాడు.

అతడి శరీరమంతా దద్దుర్లు కనిపించడంతో పాటు ఇతర లక్షణాలు కూడా ఉండడంతో అప్రమత్తమైన అధికారులు నమూనాలు సేకరించి పూణెలోని జాతీయ వైరాలజీ ఇనిస్టిట్యూట్‌కు పంపారు.  ప్రస్తుతం అతడిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స చేస్తున్నట్టు వైద్యులు తెలిపారు. అధికారులు అతడి కాంటాక్ట్‌లను గుర్తించే పనిలో పడ్డారు.

అయితే, ఈ విషయంలో భయపడాల్సిన అవసరమేమీ లేదని వైద్యులు చెబుతున్నారు. అతడికి సోకింది మంకీపాక్సా? కాదా? అన్నది ఇంకా నిర్ధారణ కాలేదని చెప్పారు. మరోవైపు, ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు వారానికి 75 శాతం చొప్పున పెరుగుతూ పోతున్నాయని పేర్కొంది. ప్రస్తుతం 6 వేల కేసులు ఉన్నట్లు తెలిపింది.

దక్షిణాఫ్రికాలో పుట్టిన ఈ వైరస్  ఇప్పుడు నెమ్మదిగా ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ఐరోపా, ఆఫ్రికాలలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో 80 శాతం ఒక్క ఐరోపాలోనే నమోదైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ తెలిపారు. మంకీపాక్స్ అనేది తీవ్రమైన వైరల్ వ్యాధి.

ఇది సోకితే ఫ్లూ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరం నిండా దద్దుర్లు, రసి, దురదలు వంటివి రెండు నుంచి నాలుగు వారాలపాటు వేధిస్తాయి. వైరస్ సోకిన వ్యక్తిని తాకడం ద్వారా ఇది వ్యాపిస్తుంది. అలాగే, దుస్తులు, పరుపులు, తుంపర్లు, శృంగారం, చుంబనం ద్వారా ఒకరి నుంచి మరొకరికి ఇది వ్యాప్తి చెందుతుంది. లక్షణాల విషయానికి వస్తే తీవ్రమైన జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు, అలసట, బొబ్బలు, మొటిమల్లా కనిపించే దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి.