నావికాదళంలో 20 శాతం మంది అగ్నివీరులు మహిళలే!

భారత నావికా దళంలోకి ‘అగ్నివీర్స్’ల ఎంపికలో దాదాపు 20 శాతం మంది మహిళలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.  ‘అగ్నిపథ్’ రిక్రూట్‌మెంట్ పథకం కింద ఈ ఏడాది సుమారు 3,000 మంది సిబ్బందిని నియమించాలని నేవీ యోచిస్తోంది. జులై 1 నుంచి ఔత్సాహికుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది.
కొత్త పథకం ద్వారా నేవీ మొదటిసారిగా మహిళలను, నావికులను రిక్రూట్ చేయనుంది. నావికాదళ అగ్నివీర్లలో 20 శాతం మంది మహిళలు తమ అవసరాలకు అనుగుణంగా చేర్చుకోనుందని నేవీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. జూన్ 14న ప్రకటించిన అగ్నిపథ్ పథకం 17న్నర సంవత్సరాల నుండి 21 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులను కేవలం 4 సంవత్సరాలకు మాత్రమే రిక్రూట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది.
వారిలో 25 శాతం మందిని మరో 15 సంవత్సరాల పాటు కొనసాగించ గలరు.    2022 కోసం గరిష్ట వయోపరిమితి 23 సంవత్సరాలు పొడిగించారు. ఈ పథకం కింద త్రివిధ దళాలు ఈ సంవత్సరం 46 వేల మంది సిబ్బందిని నియమించుకోనున్నాయి. రాబోయే సంవత్సరాల్లో వారి సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నట్టు అధికారులు చెబుతున్నారు.
ఇక.. జూలై 15 నుండి 30వ తేదీ వరకు దరఖాస్తు విండో తెరిచి ఉంటుంది.   అక్టోబర్ మధ్యలో పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ వంటి పరీక్షలు జరుగుతాయని నేవీ ఇప్పటికే ప్రకటించింది. నవంబరు 21 నాటికి ఒడిశాలోని ఐఎన్ఎస్  చిల్కాలో శిక్షణా కార్యక్రమంలో మొదటి బ్యాచ్ రిక్రూట్‌లు చేరతారని పేర్కొంది. ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందన లభిస్తున్నది.