కేరళలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై బాంబు దాడి

కేరళలోని కన్నూర్ జిల్లాలో దుండగులు రెచ్చిపోయారు. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ కార్యాలయంపై బాంబు దాడి జరిగింది. కన్నూర్‌ జిల్లా పయ్యన్నూర్‌లోని కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటన తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో జరిగింది. 

దాడి జరిగిన సమయంలో కార్యాలయంలో కార్యకర్తలు ఉన్నారని, కానీ గాయాలు కాకుండా తప్పించుకున్నారని పోలీసుల తెలిపారు. ఈ దాడిలో కార్యాలయ కిటికీలు, అద్దాలు, తలుపులు ధ్వంసం అయ్యాయి. అయితే, దాడికి గల కారణాలు తెలియరాలేదు. 

ప్రస్తుతం నిందితుల కోసం గాలిస్తున్నామని, ఇందులో భాగంగా సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.అయితే, సీపీఎం కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ఆర్‌ఎస్‌ఎస్‌ ఆరోపించింది. దాడి జరిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ ఆఫీసు స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు సమీపంలోనే ఉండటం గమనార్హం.

బాంబు పేలిన సంఘటన సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తున్నది. మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు అంతకుముందు ఆ ప్రాంతాన్ని స్కాన్ చేసిన్నట్లు అంధులు వెల్లడైనది. ఈ సంఘటనలో ఆర్ఎస్ఎస్ కార్యాలయం  సరిహద్దు గోడలో అనేక పేలుళ్లు కనిపించాయి.  ఈ సంఘటనలో అనేక కిటికీలు దెబ్బతిన్నాయి.

జూన్ 30 రాత్రి తిరువనంతపురంలోని సీపీఎం  రాష్ట్ర ప్రధాన కార్యాలయం, ఏకేజీ సెంటర్ గోడపై బాంబు విసిరిన కొద్ది రోజుల తర్వాత ఈ దాడి జరిగింది.  ఆ కేసులో దాడి చేసిన వ్యక్తిని పోలీసులు ఇంకా గుర్తించలేదు. కేరళ ప్రభుత్వం వేర్పాటువాదులకు మద్దతు ఇస్తూ ఉండడం చేత  ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో ఇలాంటి దాడులు చాలా జరుగుతున్నాయని బిజెపి ఆరోపించింది.

ఈ దాడికి కేరళ ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ ఎంపీ రజనీష్ అగర్వాల్ స్పష్టం చేశారు. “కేరళ ప్రభుత్వం ఉగ్రవాదులకు, వేర్పాటువాదులకు రక్షణ కల్పిస్తుంది. రాష్ట్రంలో రాజకీయ హింస, రాజకీయ పార్టీల కార్యాలయాలపై నిరంతరం దాడులు జరుగుతున్నాయి. ప్రజలు సరైన సమయంలో వారికి తగిన గుణపాఠం చెబుతారు. కేరళలోని ప్రజలు దీనిని చూస్తున్నారు.  వారు ప్రజాస్వామ్య పద్ధతిలో తగిన సమాధానం ఇస్తారు,” అని అగర్వాల్ హెచ్చరించారు.

ఇదిలా ఉండగా, ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రేష్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి  కాంగ్రెస్ వీలుచిక్కినప్పుడల్లా ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం విధించడానికి ప్రయత్నించిందని గుర్తు చేశారు. లౌకికవాదులు, కమ్యూనిస్టులు ఎల్లప్పుడూ విదేశీ శక్తులకు మద్దతు ఇస్తుంటారని, భారతదేశానికి మద్దతు ఇవ్వరని ధ్వజమెత్తారు.

 కేరళ, బెంగాల్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయాలపై దాడులు చేసేందుకు ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతూ,  ఇలాంటి దాడులను అరికట్టేందుకు కేరళ ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టాలని కోరారు.

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి రాజ్యవర్ధన్ రాథోడ్ ట్విటర్‌లో స్పందిస్తూ, “కేరళలోని కన్నూర్ జిల్లా పయ్యన్నూరులో ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంపై బాంబు దాడిని ఖండిస్తున్నాను. రాహుల్ గాంధీ ఒక్క మాట కూడా ఖండించలేదు. హిందుత్వ, ఆర్‌ఎస్‌ఎస్‌పై నిరంతరం విషాన్ని రెచ్చగొడుతున్నాడు. దాడి వెనుక ఎవరున్నారో గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు.

‘ఈ దాడిలో సీపీఎం పాత్ర ఉందని మేము అనుమానిస్తున్నాం. బంగారం స్మగ్లింగ్ వ్యవహారం బహిర్గతమైన తర్వాత అధికార పార్టీ పీకల్లోతు కష్టాల్లోకి జారుకుంది. దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇలాంటివి చేస్తోంది.’ అని బీజేపీ కన్నూర్‌ జిల్లా అధ్యక్షుడు ఎన్‌ హరిస్‌దాసన్‌ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: Reverse Waterfall: ఆకాశంలోకి ఎగిరే జలపాతాన్ని ఎప్పుడైనా చూశారా?