వైసీపీకి వైఎస్ విజయమ్మ రాజీనామా!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తల్లిగారైనా వై ఎస్ విజయమ్మ వైసీపీ గౌరవ అధ్యక్ష పదవికి, ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్లీనరీ వేదికగా శుక్రవారం ప్రకటించారు. ఇడుపులపాయలో వైస్సార్ ఘాట్ వద్ద నివాళ్లు అర్పించిన జగన్, విజయమ్మలు ప్లీనరీ వేదికవద్దకు వచ్చారు. 
 
జగన్‌ మోహన్‌రెడ్డి.. పార్టీ జెండాను ఆవిష్కరించి ప్లీనరీని ప్రారంభించి, ప్రారంభోపన్యాసం చేసారు. 2009 సెప్టెంబర్‌ 25న పావురాల గుట్టలో మొదలైన సంఘర్షణ ఓదార్పు యాత్రతో పార్టీ ఒక​ రూపం దాల్చిందని ముఖ్యమంత్రి తెలిపారు. వైఎస్సార్‌ ఆశయాల సాధన కోసం పార్టీ ఆవిర్భవించిందని అంటూ కోట్లాది మంది అభిమానులకు, ప్రజలకు సెల్యూట్‌ అని ముఖ్యమంత్రి చెప్పారు. 
 
ఈ 13 ఏళ్లలో ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామని జగన్‌ చెప్పుకొచ్చారు. “మనపై ఎన్ని రాళ్లు పడ్డా, మనపై ఎన్ని నిందలు వేసినా ఎదుర్కొన్నాం. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని దాడులు జరిగినా గుండె చెదరలేదు. సంకల్పం మారలేదు. నాన్న ఇచ్చిన ఈ కుటుంబం ఏనాడూ నా చేయి వీడలేదు’’ అని జగన్ స్పష్టం చేశారు. 
 
తెలంగాణలో తన కుమార్తె షర్మిల పార్టీ పెట్టడం, అక్కడా, ఇక్కడా తనే కొనసాగడంపై విమర్శలు రాకూడదనే రాజీనామా చేస్తున్నట్లు విజయలక్ష్మి ప్రకటించారు. ఇలాంటి రోజు వస్తుందని తాను అనుకోలేదని, వక్రీకరణలకు, విమర్శలకు తావు లేకుండా ఉండేందుకే రాజీనామా చేస్తున్నట్లుగా ఆమె ప్రకటించారు.
తెలంగాణలో షర్మిలకు అండగా ఉండేందుకే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. షర్మిలకు రాజకీయంగా అండగా ఉంటానని, అలాగే ఒక తల్లిగా జగన్‌కు ఎప్పుడూ మద్దతు ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. తన కుమారుడు, కుమార్తెలిద్దరూ వేర్వేరు రాష్ట్రాలకు వేర్వేరు పార్టీలకు ప్రతినిధులుగా ఉన్నారని చెబుతూ తాను రెండు రాష్ట్రాలలో కొనసాగడం సరికాదని ఆమె పేర్కొన్నారు.
తన బిడ్డ షర్మిల తెలంగాణలో ఒంటరిగా పోరాటం చేస్తుందని , తన బిడ్డకు నా అండ ఉండాలని  వైసీపీ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు విజయమ్మ తెలిపింది. షర్మిలకు అండగా ఉండేదుకే రాజీనామా చేస్తున్న తప్ప మరోటి లేదని తేల్చి చెప్పింది. కాగా, తెలంగాణ రాష్ట్రంలో ముందుగానే ఎన్నికలు వస్తాయని వైఎస్‌ విజయమ్మ ప్రకటించారు. తెలంగాణ లో షర్మిల గడ్డి ప్రయత్నం చేస్తుందని ఆమె చెప్పారు.