వైసిపి జీవిత కాలపు అధ్యక్షునిగా జగన్ ఎన్నిక 

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జీవితకాల అధ్యక్షుడిగా ఏపీ ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు గుంటూరులో నిర్వహించిన పార్టీ ప్లీనరీలో శనివారం తీర్మానం చేసి ఆమోదించారు. పారదర్శక పాలన, సామాజిక సాధికారత, పరిశ్రమలు,ఎంఎస్‌ఎంఈలు, వ్యవసాయంపై తదితర అంశాలపై తీర్మానాలు చేసి, వాటిపై చర్చించారు.
తీర్మానాలను ఆమోదించిన అనంతరం సీఎం జగన్‌  మాట్లాడుతూ మూడేళ్ల పాలనలో ఆర్థిక, సామాజిక, రాజకీయ, వైద్యం, వ్యవసాయం.. ఇలా అనేక రంగాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. బాధ్యత కలిగిన పార్టీగా మన భవిష్యత్తును తీర్చిదిద్దుకునేలా అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చామని చెప్పారు.
”అప్పట్లో కాంగ్రెస్‌, టిడిపి కలిసి నాపై కేసులు పెట్టాయి. ఓదార్పు యాత్ర మానుకోవాలని ఒత్తిడి చేశాయి. శక్తివంతమైన వ్యవస్థలతో దాడి చేయించారు. మనకు అన్యాయం చేసిన పార్టీల ప్రస్తుత పరిస్థితి ఏంటి? మనకు అన్యాయం చేసిన పార్టీలకు రాష్ట్రంలో నామరూపాలు లేవు” అని ప్రత్యర్థులపై దండెత్తారు.
“2014లో ఓడినా నాపై కుట్రలు, కుతంత్రాలు ఆపలేదు. 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను కొన్నారు. మన పార్టీ ఉండకూడదని కుయుక్తులు పన్నారు. మా వద్ద ఎన్ని కొన్నారో వాళ్లకు అన్ని సీట్లే వచ్చాయి. దేవుడు స్క్రిప్ట్‌ రాస్తే గొప్పగా రాస్తాడు.. ఎప్పటికైనా మంచే గెలుస్తుంది” అని గుర్తు చేశారు.
 మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి విషయం నెరవేరుస్తున్నామని చెబుతూ ఈ మూడేళ్లలో మంచి పాలన అందించడంపైనే దఅష్టిపెట్టాను తప్ప ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలను లాక్కోవడంపై దఅష్టి పెట్టలేదు. నాయకుడిని, పార్టీని నడిపించేవి స్పష్టం చేశారు. గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేసేందుకే వలంటీర్లు, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చామని తెలిపారు.
ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన టిడిపి నేతలకు ఎప్పుడైనా వచ్చిందా? అని ప్రశ్నించారు.  ప్రజలకు మంచి చేసే చిప్‌.. గుండెలో ఉండాలని అంటూ చంద్రబాబుకు ఎప్పుడూ పదవిపై వ్యామోహం మాత్రమే ఉందని ఎద్దేవా చేశారు.  తెలుగుదేశం పార్టీ పెత్తందార్ల పార్టీ.. ఆయన పార్టీ సిద్ధాంతం.. వెన్నుపోటు మాత్రమే అని పేర్కొంటూ రెండు సిద్ధాంతాలు, భావాల మధ్య ఇవాళ యుద్ధం జరుగుతోందని జగన్‌ వెల్లడించారు.
కాగా, చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా ఓటేసినట్లేనని, సంక్షేమ పథకాలను కాపాడుకునే బాధ్యతను ప్రజలదేనని సీఎం జగన్‌ హెచ్చరించారు.  ‘చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పధకాలకు వ్యతిరేకంగా ఓటేసినట్లే. చక్కాలు లేని సైకిల్‌ను చంద్రబాబు తొక్కలేకపోతున్నారు. రాష్ట్రంలో అందరికీ న్యాయం చేసేందుకే మూడు రాజధానులు. చంద్రబాబును ఓడించే యుద్ధం అర్జునుడి పాత్ర ప్రజలదే’ అని స్పష్టం చేశారు.

“ఎన్నికల దగ్గరపడే కొద్దీ దుష్టచతుష్టయం దుష్ప్రచారం ఎక్కువైంది. అసత్యాలు, వెన్నుపోట్లు మనకు తెలీదు. వెన్నుపోటు ద్వారా అధికారం లాక్కోవడం నాకు తెలీదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు మనకు లేరు. ఈ దొంగల ముఠాతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. సంక్షేమ పథకాలను ఆపేయాలన్నేదే దుష్టచతుష్టయం కుట్ర. ఓట్ల కోసం చంద్రబాబు దొంగ వాగ్దానాలతో మళ్లీ మీ ముందకొస్తారు” అని ప్రజలను హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాలు గెలవడమే మన లక్ష్యం అని వెల్లడించారు.