శ్రీలంక అధ్యక్ష భవనం నుండి రాజపక్స పలాయనం

శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితులు కొనసాగుతూ ఉండడంతో గొటబయ రాజపక్స  అధ్యక్ష పదవీ బాధ్యతల నుంచి దిగిపోవాలంటూ పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు చెలరేగాయి. కొలంబోలోని అధ్యక్షుడి అధికారిక నివాసాన్ని పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు శనివారం చుట్టుముట్టారు. 
నిరసనకారుల ఆగ్రహాన్ని పసిగట్టి గొటబయ రాజపక్స అధికారిక నివాసం నుంచి ఆర్మీ హెడ్‌క్వాటర్స్‌కు తరలించామని శ్రీలంక రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారమివ్వడంతో శుక్రవారం రాత్రే అధ్యక్షుడిని ఆర్మీ కార్యాలయానికి తరలించినట్టు వివరించారు. 
 
భద్రత దృష్ట్యా అధ్యక్షుడు గొటబయకు ఎస్కార్ట్ కల్పించామని ఆయావర్గాలు వివరించాయి. అధ్యక్ష భవనాన్ని చుట్టుముడుతున్న ఆందోళనకారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో సమూహాన్ని చెదరగొట్టేందుకు బలగాలు గాల్లోకి కాల్పులు జరిపాయని అధికారులు వివరించారు. కాగా అంతకుముందు అధ్యక్షుడు గొటబయ అధికారిక కార్యాలయం నుంచి పారిపోయినట్లు వార్తలు వచ్చాయి.
 
కర్ఫ్యూ అమలులో ఉన్నప్పటికీ దేశం నలుమూలల నుండి వేలాదిమంది తరలివచ్చి నిరసనలో పాల్గొన్నారు.  దానితో శ్రీలకం అధ్యక్షుడి అధికారిక నివాసం రణరంగంగా మారింది. రాజీనామా చేయాలనే డిమాండ్లతో పెద్ద సంఖ్యలో నిరసనకారులు కార్యాలయాన్ని చుట్టుముట్టారు. ప్రతిపక్ష పార్టీలు సవాలు చేయడంతో పోలీసులు  కర్ఫ్యూని ఎత్తివేశారు. దీంతో వేలాది మంది నిరసనకారులు అధ్యక్షుడి అధికారిక నివాసంలోకి చొచ్చుకెళ్లారు.
 భద్రతా బలగాల బారికేడ్లను దాటుకుని మరీ లోపలికి ప్రవేశించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు న్యూస్ చానళ్లలో ప్రసారమయ్యాయి. మరి కొద్దిసేపటికే అధ్యక్షుడు పారిపోయినట్టు వార్తలు వచ్చాయి. 22 లక్షల మంది శ్రీలంక వాసులు తీవ్ర సంక్షోభం ఉండడంతో అధ్యక్ష పదవి నుంచి గొటబయ రాజపక్స తప్పుకోవాలని శ్రీలంకేయులు డిమాండ్ చేస్తున్నారు.
రాజధాని కొలంబో నగరంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలనుకున్నారు. ప్రణాళికకు అనుగుణంగా శుక్రవారం రాత్రే వేలాది మంది కొలంబో చేరుకున్నారు. ఈ పరిస్థితులను ఇంటెలిజెన్సీ వర్గాలు గమనించాయి. నిరసనకారుల చేతుల్లో శ్రీలంక జాతీయ జెండాలు కనిపించాయి. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, ఉద్యమకారులు, బార్ అసోషియేషన్ సభ్యులు ఈ నిరసనల్లో పాల్గొన్నారు.