లాలూ ఆరోగ్య పరిస్థితి మరింత విషమం

బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్‌ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. ఆయన శరీరంలో కదలికలు లేవని తనయుడు తేజస్వీ యాదవ్‌ తెలిపారు. ఇప్పటి వరకు వైద్యులు చాలా మందులు ఇచ్చారని, అయినా ఎలాంటి పురోగతి లేదని చెప్పారు.

వైద్యులు మరోసారి పరిశీలించిన తర్వాత ఏం చేయాలనే దానిపై తేజస్వీ యాదవ్‌ నిర్ణయం తీసుకుంటామన్నారు. లాలూ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోతే సింగపూర్‌ తీసుకెళ్తామని తేజస్వి యాదవ్‌ ఇది వరకే వెల్లడించారు.

ఇంట్లో మెట్లపై నుంచి కిందపడిన సమయంలో లాలూకు మూడు చోట్ల గాయాలయ్యాయి. ఈ క్రమంలో మెరుగైన చికిత్స కోసం ఆయనను ఎయిర్‌ అంబులెన్స్‌లో ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు.  లాలూ పరిస్థితి విషమించిన నేపథ్యంలో పలువురు బిహార్‌ మంత్రులు, రాజకీయ ప్రముఖులు ఢిల్లీ ఎయిమ్స్‌కు చేరుకుంటున్నారు.

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ ఆస్పత్రికి వచ్చి వైద్యులతో మాట్లాడారు. లాలూ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం తేజస్వి యాదవ్ కు ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. త్వరలో కోలుకోవాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు.

లాలూ పెద్దకుమర్తె మిసా భారతి లాలూతోనే ఉన్నారు. లాలూ భార్య, మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, చిన్న కుమారుడు తేజస్వీ ప్రసాద్‌ యాదవ్‌ విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. లాలూ చికిత్సకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ తెలిపారు. బుధవారం పాట్నాలోని పరాస్‌ ఆసుపత్రికి వెళ్లి లాలూను పరామర్శించారు.