ఆహార భద్రతలో ఒడిశా 1, ఏపీ 3, తెలంగాణ 12 ర్యాంకులు

దేశవ్యాప్తంగా ఆహార భద్రతాచట్టం అమలులో ఒడిసా ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ చట్టం బాగా అమలవుతున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ మూడోస్థానంలో ఉండగా, తెలంగాణ 12వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో జరిగిన రాష్ట్రాల ఆహార మంత్రుల సదస్సులో 2022 సంవత్సరానికిగాను రాష్ట్రాలకు ర్యాంకులను కేంద్రం ప్రకటించింది. 

కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆ ర్యాంకుల వివరాలను సదస్సులో వెల్లడించారు. చౌకదుకాణాల్లో పౌరసరఫరాల తీరుతెన్నులు ప్రమాణంగా సూచీలను రూపొందించారు. 

ఇందులో 0.836 స్కోరుతో ఒడిసా ముందు వరసలో నిలవగా, ఉత్తరప్రదేశ్‌ 0.797 స్కోరు చేసి ద్వితీయస్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌ 0.794 స్కోరు దక్కించుకుని మూడో ర్యాంకు సొంతం చేసుకుంది.  గుజరాత్ నాలుగో స్థానంలో ఉండగా, దాద్రా, నాగర్ హవేలి, దామన్, డయ్యు, మధ్యప్రదేశ్, బీహార్, కర్నాటక, తమిళనాడు, జార్ఖండ్‌లు వరసగా తొలి పది స్థానాల్లో నిలిచాయి. 

కాగా కేరళ 11వ స్థానంలో, తెలంగాణ 12వ స్థానంలో నిలిచాయి. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, చత్తీస్‌గఢ్, గోవా వరసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ర్యాంకులు ఇచ్చే ప్రక్రియ తమ మంత్రిత్వ శాఖ చేపట్టినప్పటికీ, థర్డ్ పార్టీ దీన్ని నిర్వహించిందని పీయూష్ చెప్పారు.

ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాల్లో (హిమాలయన్ రాష్ట్రాలు, ఐలాండ్ రాష్ట్రాలు) త్రిపుర తొలి ర్యాంక్ దక్కించుకోగా హిమాచల్‌ప్రదేశ్, సిక్కింలు తర్వాతి రెండు స్థానాలను దక్కించుకున్నాయి. రవాణా సదుపాయాల పరిమితులున్నప్పటికీ ఈ రాష్ట్రాలు జనరల్ రాష్ట్రాలతో కూడా పోటీ పడడంలో ఎంతో కమిట్‌మెంట్‌ను ప్రదర్శించాయని ఆ నివేదిక ప్రశంసించింది.