నుపూరు తల నరికిన వారికి ఇల్లు ఇస్తానన్న ఖాదిమ్ అరెస్ట్

మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మ తల నరికి చంపిన వారికి తన ఇంటిని బహుమతిగా ఇస్తానని ప్రకటించిన అజ్మీర్ దర్గా ఖాదీమ్ సల్మాన్ చిస్తీని రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. నూపుర్ శర్మను తల నరికి చంపిన ఎవరికైనా తన ఇంటిని బహుమతిగా ఇస్తానని సల్మాన్ చిస్తీ వివాదాస్పద వీడియోలో పేర్కొన్నాడు.
దీంతో అజ్మీర్ దర్గా ఖాదీమ్ సల్మాన్ చిస్తీని అజ్మీర్ పోలీసులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు.  అర్దరాత్రి 12.45గంటలకు అరెస్ట్ చేసినట్లు అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వికాస్ సంగ్వాన్ తెలిపారు.నూపుర్ శర్మను బెదిరించిన వీడియో వైరల్ అయింది. మూడు నిమిషాల వీడియోలో సల్మాన్ చిస్తీ తన మతపరమైన భావాలను కారణంగా చూపుతూ నూపుర్ శర్మను చంపేస్తానని బహిరంగంగా బెదిరించాడు.
‘‘నాకు జన్మనిచ్చిన మా అమ్మపై ప్రమాణం చేస్తున్నాను, నేను నూపుర్ శర్మను బహిరంగంగా కాల్చివేస్తాను. నేను నా పిల్లలపై ప్రమాణం చేస్తున్నాను, నేను ఆమెను కాల్చివేస్తాను ఈ రోజు కూడా నేను చెబుతున్నాను, నూపుర్ శర్మ తల ఎవరు తీసుకువస్తే, అతనికి నా ఇల్లు బహుమతిగా ఇస్తాను’’  అని సల్మాన్ చిస్తీ వీడియోలో పేర్కొన్నాడు.
ఈ వీడియో వైరల్ కావడంతో అజ్మీర్ నగరంలోని అల్వార్ గేట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ వీడియో విషయంలో తాము చాలా కఠిన వైఖరిని అవలంబిస్తున్నారని అజ్మీర్ ఏఎస్పీ వికాస్ సంగ్వాన్ తెలిపారు. వీడియోలో సల్మాన్ చిస్తీ మద్యం తాగిన స్థితిలో కనిపించాడని ఏఎస్పీ సాంగ్వాన్ చెప్పారు. నిందితుడు సల్మాన్​ చిస్తీకి నేర చరిత్ర ఉందని పోలీసులు వెల్లడించారు.  
 
మరోవైపు సల్మాన్​ చిస్తీ  వీడియోలోని సందేశాన్ని అజ్మీర్ దర్గా ఆఫీసర్ దివాన్ జైనుల్​ ఆబిదీన్​అలీ ఖాన్  ఖండించారు. అజ్మీర్​ దర్గా మత సామరస్యానికి ప్రతీక అని, వీడియోలో ఖాదిమ్​ వ్యక్తంచేసిన అభిప్రాయాలను దర్గా సందేశంగా చూడొద్దని కోరారు.  వాటిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.   ఆ వ్యాఖ్యలను సల్మాన్​ చిస్తీ వ్యక్తిగత అభిప్రాయంగానే చూడాలని కోరారు.