50 ఏళ్ల పైబడిన మహిళా ఖైదీలు, ట్రాన్స్‌జెండర్లకు జైలు శిక్ష తగ్గింపు

జైళ్ల్లలో శిక్ష అనుభవిస్తున్న 50 ఏళ్ల పైబడిన మహిళా ఖైదీలు, ట్రాన్స్‌జెండర్లకు ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకల సందర్భంగా జైల్లో వారి ప్రవర్తనను బట్టి వారి శిక్షల్లో ప్రత్యేక మినహాయింపు ఇచ్చి విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. 60 ఏళ్లు పైబడిన పురుష ఖైదీలు, దివ్యాంగులు కూడా ఈ మినహాయింపు కిందికి వస్తారు.

 అయితే వారు తమకు విధించిన మొత్తం శిక్షలో సగం పూర్తి చేసి ఉండాలి. అలాగే తమకు విధించిన జరిమానాలు చెల్లించలేక శిక్షాకాలం పూర్తయినా జైల్లోనే మగ్గుతున్న నిరుపేద, అనాథ ఖైదీల జరిమానాలు మాఫీ చేయడం ద్వారా వారికి కూడా ఈ పథకం వల్ల ప్రయోజనం చేకూరుతుంది. 

అయితే మరణ శిక్షలు, యావజ్జీవ శిక్షలు, అత్యాచారం, ఉగ్రవాద అభియోగాలపై శిక్ష అనుభవిస్తున్న వారు, వరకట్న మరణాలు, మనీ లాండరింగ్ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న వారికి ఈ పథకం వర్తించదని హోంమంత్రిత్వ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. 2020 నాటి అధికారిక లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా జైళ్లలో పరిమితికి మించి ఖైదీలున్నారు. 

మొత్తం జైళ్లలో 4.03 లక్షలమంది ఖైదీలను ఉంచడానికి సదుపాయాలు ఉండగా 4.78 లక్షలకు పైగా ఖైదీలున్నారు. వీరిలో దాదాపు లక్ష మంది మహిళా ఖైదీలున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు హోంమంత్రిత్వ శాఖ పంపిప సందేశం ప్రకారం, శిక్ష మినహాయింపునకు అర్హులైన ఖైదీలను మూడు దశల్లో అంటే  ఆగస్టు 15, 2022; జనవరి 26, 2023; ఆగస్టు 15, 2023న విడుదల చేస్తారు.

శిక్షా కాలంలో జైలులో నిరంతరం సత్ప్రవర్తన కలిగిన వారు, ముఖ్యంగా గత మూడేళ్ల కాలంలో ఎలాంటి పనిష్మెంట్ లేని వారు ఈ శిక్ష మినహాయింపు పొందడానికి అర్హులుగా పరిగణిస్తారు. సీనియర్ సివిల్, పోలీసు అధికారలుతో కూడిన రాష్ట్ర స్థాయి స్క్రీనింగ్ కమిటీ ద్వారా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఖైదీలను విడుదల చేసే అంశంపై నిర్ణయం తీసుకోవాలని కూడా హోం శాఖ ఆ లేఖలో తెలియజేసింది.

అలాగే 18 నుండి 21 ఏళ్ల మధ్య నేరానికి పాల్పడిన, వేరే ఇతర క్రిమిల్ కేసులు లేని వారు, శిక్షా కాలంలో 50 శాతం పూర్తి చేసుకున్న వారికి కూడా ఈ ప్రత్యేక శిక్ష మినహాయింపు పరిశీలించవచ్చని తెలిపింది. కాగా, చట్టప్రకారం కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరమైన వారి కేసులను, విదేశీ ఖైదీల విషయంలో సంబంధిత శాఖల అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే విడుదల చేయాలని కూడా స్పష్టం చేసింది.