వైద్యరంగం బలోపేతంకు రూ 13,834 కోట్ల ప్రపంచ బ్యాంకు ఋణం

కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్‌ భారత్‌ సహా పలు పథకాలు, రాష్ట్రాలకు 1.75 బిలియన్‌ డాలర్ల మొత్తాన్ని (రూ.13,834.54 కోట్లు) ప్రపంచ బ్యాంకు మంజూరు చేసింది. ప్రభుత్వ వైద్య రంగం బలోపేతానికి ఖర్చు చేసేందుకు ఈ రుణం మంజూరు చేసింది. అలాగే ఆర్థిక రంగం మరింత వృద్ధి చెందేలా ప్రైవేటు పెట్టుబడుల కోసం కూడా కొంత మొత్తం రుణంగా మంజూరు చేసింది.

ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్ల సమావేశంలో శనివారం ఈ నిర్ణయం తీసుకున్నారు. గత అక్టోబర్‌లో దేశంలో ప్రారంభించిన ప్రధాన మంత్రి ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మిషన్‌ పథకంవల్ల దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు, సేవలు మెరుగుపడ్డాయి. ఈ నేపథ్యంలో తాజాగా 1 బిలియన్‌ డాలర్ల మొత్తాన్ని ప్రోత్సాహక రుణంగా మంజూరు చేసింది.

ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వానికి కేటాయించింది. ఇదికాక ఆంధ్ర ప్రదేశ్‌, కేరళ, మేఘాలయ, ఒడిశా, పంజాబ్‌, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాలలో వైద్య, ఆరోగ్య రంగం అభివృద్ధికి విడిగా 750 మిలియన్‌ డాలర్ల మొత్తాన్ని డెవలప్‌మంట్‌ పాలసీ రుణంగా అందజేసింది.

గడచిన కొద్దికాలంగా భారత్‌ వైద్యరంగం చాలా అభివృద్ధి చెందిందని ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది. భారత్‌లో జీవనకాలం 1990లో 58 ఏళ్లుగా ఉంటే 2020లో 69.8 సంవత్సరాలుగా ఉందని పేర్కొంది. ఐదేళ్ల లోపు చిన్నారుల మరణాల రేటు, నవజాత శిశువుల మరణాల రేటు, బాలింతల మరణాల రేటులో భారీ తగ్గుదల నమోదైందని తెలిపింది.

టీకాల కార్యక్రమం సజావుగా సాగడం, నిపుణుల సాయంతో ప్రసవాలు జరిగేలా చూడటం వంటి, వైద్యసేవలు మెరుగవడంవల్ల వైద్యరంగం మేలుమలుపు తిరిగిందని ప్రశంసించింది. అయితే, కోవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో ప్రజారోగ్యానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తోందని, వైద్య రంగంలో సంస్కరణలు, నాణ్యమైన వైద్యం అందించడం అనివార్యమవుతోందని అభిప్రాయపడింది.

అందుకే భారత్‌కు పెద్దఎత్తున రుణసదుపాయం కల్పిస్తున్నామని ప్రపంచ బ్యాంక్‌ తాత్కాలిక డైరక్టర్‌ (భారత్‌) హిడెకి మోరి తెలిపారు. కరోనా  విజృంభిస్తున్న తరుణంలో భారత్‌ సాహసోపేతంగా వైద్యరంగాన్ని అభివృద్ధి చేయడానికి చేసిన ప్రయత్నాలు చూసి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

పబ్లిక్‌ హెల్త్‌ సిస్టమ్స్‌ ఫర్‌ పాండమిక్‌ ప్రిపేర్డ్‌నెస్‌ ప్రోగ్రామ్‌ (పీహెచ్‌ఎస్‌పీపీ), ఎన్‌హాన్స్‌డ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ డెలివరీ ప్రోగ్రామ్స్‌ (ఈహెచ్‌ఎస్‌డీపీ) కార్యక్రమాల కోసం ఇస్తున్న ఈ రుణం వల్ల ప్రభుత్వ వైద్య రంగంలో మార్పులు చోటుచేసుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత వైద్యరంగంలో మొదలైన సంస్కరణకు తామిచ్చే రుణాలు మరింత ఊతమిస్తాయని పేర్కొన్నారు.

రాష్ట్రాలకు ఇచ్చే 750 మిలియన్‌ డాలర్ల రుణంలో 667 డాలర్ల మొత్తాన్ని పునర్నిర్మాణం, అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు ఇస్తోందని, మిగిలిన 83 మిలియన్‌ డాలర్ల మొత్తాన్ని ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ అసోసియేషన్‌ (ఐడీఏ) ద్వారా ఇస్తున్నామని చెప్పారు.