ఉక్రెయిన్ తో చర్చలు జరపాలి … పుతిన్ కు మోదీ సూచన

ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న పరిస్థితులపై శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. చర్చలు, దౌత్యానికి అనుకూలంగా భారతదేశం దీర్ఘకాల వైఖరిని పునరుద్ఘాటించారు. ఉక్రెయిన్‌–రష్యా విషయంలో ఇండియా వైఖరిని మరోసారి గుర్తుచేశారు. శాంతి చర్చలతోపాటు దౌత్య మార్గాల్లో ఇరు దేశాల మధ్య వివాదాలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని మోదీ పేర్కొన్నారు. 
ఫోన్‌లో మాట్లాడిన ఇరువురు నేతలు గ్లోబల్ ఎనర్జీ, ఫుడ్ మార్కెట్‌ల స్థితిగతులపై కూడా చర్చించినట్లు ప్రధాని మోదీ  కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.  “వ్యవసాయ వస్తువులు, ఎరువులు, ఫార్మా ఉత్పత్తులలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత ప్రోత్సహించడం ఎలా అనే దానిపై వారు పరస్పరం మాట్లాడుకున్నారు” అని ప్రకటన పేర్కొంది.
అంతర్జాతీయ ఇంధనం, ఆహార మార్కెట్ల స్థితితో సహా ప్రపంచ సమస్యలను కూడా నాయకులు చర్చించారు. రష్యా క్రూడ్ ఆయిల్ దిగుమతిదారుగా భారత్ కొనసాగుతున్నందున, ధాన్యాలు, ఎరువులు, ఇంధనం యొక్క నమ్మకమైన సరఫరాదారుగా రష్యా కొనసాగుతుందని పుతిన్ మోదీకి తెలిపారు.
 “ఉక్రెయిన్ పై యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి భారతదేశం శాంతి, సంభాషణ, దౌత్యం వైపే నిలబడింది. రక్తం చిందించడం ద్వారా,  అమాయకుల ప్రాణాలను పణంగా పెట్టడం ద్వారా పరిష్కారం లభించదని మేము నమ్ముతున్నాము. భారతదేశం ఏదైనా పక్షాన్ని ఎంచుకుంటే, అది శాంతి వైపు, హింసను తక్షణమే అంతం చేయడం కోసం” అని ప్రధాని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 
2021 డిసెంబర్‌లో పుతిన్‌ భారత పర్యటన సందర్భంగా తీసుకున్న నిర్ణయాల అమలు తీరును ఇరువురూ సమీక్షించారని పేర్కొన్నాయి. వ్యవసాయ ఉత్పత్తులు, ఎరువులు, ఔషధ ఉత్పత్తుల వాణిజ్యంలో భారత్‌–రష్యా పరస్పరం ఎలా సహకరించుకోవాలన్న దానిపై మోదీ, పుతిన్‌ సంప్రదింపులు జరిపారు. అంతర్జాతీయ, ద్వైపాక్షిక అంశాలపై తరచూ చర్చలు కొనసాగిస్తూ ఉండాలని నిర్ణయానికొచ్చారు.