మరోసారి ఇజ్రాయెల్ పార్లమెంట్ రద్దు

బెంజమిన్ నేతన్యాహూ సుదీర్ఘ పాలన అనంతరం ఇజ్రాయెల్‌లో ప్రభుత్వాలు పట్టుమని పది రోజులు కూడా కొనసాగడం లేదు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడం, సంకీర్ణ ప్రభుత్వాల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల నాలుగు రోజుల్లోనే ప్రభుత్వాల సమయం ముగిసిపోతుంది.
తాజాగా ఇజ్రాయెల్ పార్లమెంట్ రద్దు కావడంతో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వం సైతం రద్దైంది. దీంతో కేవలం నాలుగేళ్లలోనే ఇజ్రాయెల్‌లో ఐదోసారి ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 1న ఎన్నికలకు వెళ్లేందుకు ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. గురువారం పార్లమెంట్ రద్దుపై నిర్వహించిన ఓటింగ్‌లో అనుకూలంగా 92 మంది సభ్యులు ఓటేశారు.
120 సభ్యులు కలిగిన ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ఇంత పెద్ద మొత్తంలో అంగీకారం రావడంతో వెంటనే పార్లమెంట్ రద్దు అవుతున్నట్లు సభాపతి ప్రకటించారు. కాగా, ఇప్పటి వరకు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిగా కొనసాగిన యైర్ లాపిడ్ శుక్రవారం అర్ధరాత్రి నుంచి తాత్కాలిక ప్రధానమంత్రిగా కొనసాగనున్నారు.
ఇజ్రాయెల్‌లో అతి తక్కువ కాలం ప్రధానమంత్రిగా పని చేసిన నఫ్తాలీ బెన్నెట్ నుంచి బాధ్యతలు తీసుకున్న లాపిడ్ ఆ దేశానికి కాబోయే 14వ ప్రధానమంత్రి. ఇజ్రాయెల్ ప్రధానిగా బెంజమిన్ నెతన్యాహూ 12 ఏళ్ల పాటు కొనసాగారు. ఆయన అనంతరం వచ్చిన ప్రధానులు మాత్రం ఎక్కువ కాలం నిలబడటం లేదు.
 ఎనిమిది పార్టీలతో ఏర్పడిన ప్రభుత్వం ఏడాది కూడా గడవకముందే ముగిసిపోయింది. కూటమిలోని సభ్యుల మధ్య ఇటీవల తీవ్ర విభేదాలు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బడ్జెట్ సహా ఇతర ఒప్పందాలపై సంకీర్ణ ప్రభుత్వంలోని ప్రధాన పార్టీల మధ్య చర్చలు సఫలం కాలేదు.