పెద్ద సవాల్ గా మారిన ఇంధన భద్రత … మోదీ

రష్యా– ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఇంధన భద్రత అనేది పెద్ద సవాలుగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. సొంత ఎనర్జీ సెక్యూరిటీ విషయంలో తమకు బెస్ట్ అని భావించే పనిని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
రష్యా – ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ వైఖరిని జీ7 సదస్సులో ప్రధాని స్పష్టం చేస్తూ వీలైనంత త్వరగా యుద్ధానికి ముగింపు పలకాలని సూచించారు. సమస్య పరిష్కారానికి చర్చలు జరపాలని, దౌత్య మార్గాన్ని అనుసరించాలని చెప్పారని విదేశాంగ శాఖ కార్యదర్శ  వినయ్ మోహన్ క్వాట్రా మీడియాకు తెలిపారు. జీ7 సమ్మిట్‌‌‌‌లో రష్యా– ఉక్రెయిన్ అజెండాపై, మాస్కోపై విధించిన ఆంక్షల వల్ల భారత్ పై  ఏదైనా ఒత్తిడి పడుతున్నదా అన్న ప్రశ్నలకు ఆయన స్పందించారు.
‘‘వాతావరణం, ఎనర్జీ.. ఆహార భద్రత, లింగ సమానత్వంపై భారత్  వైఖరిని ప్రధాని స్పష్టం చేశారు. బలహీనమైన ఆర్థిక వ్యవస్థల ఆహార భద్రత కోసం సహకారం అందించడంలో భారత్ ముందంజలో ఉందని తెలిపారు. గ్లోబల్ ఆయిల్ ట్రేడ్ విషయంలో ప్రశ్నలు తలెత్తితే భారత్  తన సొంత ఇంధన భద్రత విషయంలో ఉత్తమమైన పనిని చేయడాన్ని కొనసాగిస్తుందని చెప్పారు” అని వివరించారు.
 
యూఏఈ అధ్యక్షుడుని కలిసిన మోదీ 
కాగా, యూఏఈ అధ్యక్షుడు, అబుదాబి రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌‌‌‌ను ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు. మాజీ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌‌‌‌ మృతికి ఈ సందర్భంగా సంతాపం తెలిపారు. మంగళవారం అబుదాబి ప్రెసిడెన్షియల్ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌ కు చేరుకున్న ప్రధానికి రాయల్ ఫ్యామిలీలోని సభ్యులతో కలిసి షేక్ మహమ్మద్ ఆహ్వానం పలికారు. 
 
‘‘అబుదాబి ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌లో నా సోదరుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పలికిన ప్రత్యేక ఆహ్వానం నా మనసును తాకింది. ఆయనకు నా ధన్యవాదాలు” అని ఇంగ్లిష్, అరబిక్ భాషల్లో ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.