ఉదయ్‌పూర్‌లో టైలర్ హత్య ముందు మహారాష్ట్రలో ఓ కెమిస్ట్ హత్య!

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్హయ్య లాల్ హత్యకు వారం రోజుల ముందే  మహారాష్ట్రలోని అమరావతిలో ఒక కెమిస్ట్‌ దారుణహత్యకు గురయ్యాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటనలో ఐదుగురు అనుమానితులను ఇంతవరకూ పోలీసులు అరెస్టు చేశారు.
 
కాగా ఈ హత్యా కేసును దర్యాప్తుకు ఎన్ఐఎ కు అప్పగించినట్లు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఓ ట్వీట్ ద్వారా తెలిపారు. ఈ హత్య వెనుక గల కుట్ర, సంబంధం గల  సంస్థలు, అంతర్జాతీయ సంబంధాల గురించి లోతయిన విచారణ జరిపామని ఆదేశించినట్లు చెప్పారు. 
 
స్వచ్ఛంద సంస్థను నడుపుతున్న ఐర్ఫాన్ ఖాన్ (32) అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అతని కోసం గాలిస్తున్నారు. నూపర్ శర్మ వ్యాఖ్యలకు మద్దతు పలుకుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకే కెమిస్ట్ ఉమేష్ ప్రహ్లాద్‌రావు కొల్హేను (54) హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
గత జూన్ 21 వ తేదీ రాత్రి 10 నుంచి 10.30 గంటల మధ్యలో దుకాణం మూసి ద్విచక్ర వాహనంపై కొల్హే ఇంటికి వెళ్తుండగా ఈ  హత్య జరిగింది. ఆయన కుమారుడు సాకేత్ (27), భార్య వైష్ణవి వేరే వాహనంలో ఆయనను అనుసరించారు. అమ్రావతి సిటీలో మెడికల్ షాప్‌ను కొల్హే నడుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.
మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన నూపర్ శర్మకు మద్దతుగా ఆయన కొన్ని వాట్సాప్ గ్రూపులకు ఒక పోస్ట్ షేర్ చేసినట్టు వారు చెబుతున్నారు. తన కస్టమర్లతో పాటు ముస్లింలు కూడా ఉన్న ఒక గ్రూపునకు ఆయన పొరపాటున ఈ పోస్ట్ షేర్ చేసి ఉండొచ్చని సిటీ కొత్వాలి పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు.
 
పోలీసు అధికారుల కథనం ప్రకారం, కొల్హేను చంపేందుకు ఇర్ఫాన్ ఖాన్ కుట్రపన్ని ఐదుగురు వ్యక్తులను ఆ పనికి పురమాయించాడు. వారికి రూ.10,000 ఇస్తానని, కారులో సురక్షితంగా పారిపోయే ఏర్పాటు చేస్తానని చెప్పాడు.  సాకేత్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ హత్యతో ప్రమేయమున్నట్టు అనుమానిస్తున్న ముదిసిర్ అహ్మద్ (22), షారూఖ్ పఠాన్ (25), అబ్దుల్ తోఫిక్ (24), షోయిబ్ ఖాన్ 9220, అతిబ్ రషిద్ 922) అనే వ్యక్తులను అరెస్టు చేశారు. 
 
వీరంతా అమ్రావతికి చెందిన రోజువారీ కూలీలుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన సిసీటీవీ ఫుటేజ్‌ను, హంతుకుల వాడిన ఒక కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యకు ఇతమిత్ధమైన కారణం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని పోలీస్ కమిషనర్ సింగ్ తెలిపారు.